KTR – Kavitha: కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన రెండ్రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. ఆయన వచ్చిన తర్వాతనే కవిత ఎపిసోడ్ పై అధినేత కేసీఆర్ తో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పరోక్షంగా కవిత వరుసగా కేటీఆర్ పై ఆరోపణలు చేస్తుండటంతో అసహనంతో ఉన్నట్లు సమాచారం. అప్పటివరకు ఎవరు మాట్లాడొద్దని నేతలకు అధినేత సూచనలు చేయడంతోనే ఎవరు మాట్లాడటం లేదని విశ్వసనీయ సమాచారం. అయితే కవితను ఫాం హౌజ్ కు పిలిపిస్తారా? లేకుంటే కేటీఆర్ స్వయంగా కవిత ఇంటికి వచ్చిన చర్చలు జరుపుతారా? లేకుంటే పట్టించుకోకుండా ఉంటారా? అనేది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది కూడా పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది.
కవిత, కేటీఆర్ మధ్య పరోక్ష విమర్శలతో పార్టీలో రాజకీయవేడి ఉప్పందుకుంది. ఒక్కసారిగా పార్టీలో ఏం జరుగుతుందోననే ఆందోళన సైతం కేడర్ లో నెలకొంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ సైతం మాటల తూటాలు ఎక్కుపెట్టాయి. దీంతో బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. గత నెల 27న లండన్, అమెరికా పర్యటనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. అయినా కవిత మాత్రం పేరు ఎత్తకుండా కేటీఆర్ పై విమర్శలు చేసింది.
Also Read: KCR: కాళేశ్వరం విచారణకు సమయం కోరిన కేసీఆర్.. పెద్ద ప్లానే ఉందే!
పార్టీ కేసీఆర్ ఒక్కడే నాయకుడు అని, ఆయన కిందనే పనిచేస్తానని స్పష్టం చేసింది. పరోక్షంగా కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించనని స్పష్టం చేసింది. జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగానూ తాము పోరాటాలు చేస్తుంటే కొంత మంది ఓర్వడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలన్నింటిని పార్టీ క్షుణ్నంగా పరిశీలిస్తుంది. ఈ నెల 3 రాత్రిగానీ, 4వ తేదీన గానీ కేటీఆర్ హైదరాబాద్ కు వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత కవిత చేసిన కామెంట్లపై పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కానున్నట్లు సమాచారం. ఆతర్వాతనే ఏం నిర్ణయం కవితపై తీసుకుంటారనేది చర్చకు దారితీసింది.
నేతలు మౌనం
పార్టీపై, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కవిత పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. పార్టీ గ్రామస్థాయి నుంచి కేసీఆర్ నోటీసులపై ఉద్యమ కార్యచరణ చేపట్టకుండా విదేశాల్లో నిర్వహిస్తే ఏం లాభమని ప్రశ్నించింది. పార్టీపై వరుస కామెంట్లు చేస్తున్న నేతలు ఎవరు స్పందించలేదు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే మౌనంగా ఉన్నారని సమాచారం. ఎమ్మెల్సీ రవీందర్ రావు మాత్రం కవిత వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీనితో ఆయనను సైతం మరోసారి మాట్లాడొద్దని పార్టీ సూచించినట్లు సమాచారం. నేతలు ఎవరు స్పందించినా పార్టీకి డ్యామేజ్ అవుతుందని, ప్రజల్లోకి రాంగ్ పీడ్ పోతుందని పేర్కొన్నట్లు తెలిసింది. అందుకే నేతలు ఎవరు మీడియా ముందుకు వచ్చినా కేవలం ప్రభుత్వంపై విమర్శలతోనే సరిపుచ్చుతున్నారు.
హరీష్ రావు తరహాలో ట్రీట్
వరంగల్ సభసమయంలో హరీష్ రావుకు తగిన ప్రాధాన్యత దక్కలేదని పార్టీ నేతలే బహిరంగంగా పేర్కొన్నారు. హరీష్ రావు సైతం కొంత నైరాశ్యానికి గురయ్యారు. దీంతో పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన అధినేత కేసీఆర్ ఆదేశించడంతో కేటీఆర్ కోకాపేటలోని హరీష్ రావు ఇంటికి వెళ్లారు. రెండురోజులపాటు కేటీఆర్ చర్చించారు. తాజారాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాదు ఉద్యోగుల సమస్యలపైనా పార్టీ సీనియర్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలతోనూ తొలిసారిగా భేటీ నిర్వహించారు.
దీంతో హరీష్ రావును శాంతింపచేశారు. అంతేకాదు హరీష్ రావు సైతం కేటీఆర్ కు ఏ పదవి ఇచ్చినా తాను కార్యకర్తలాగా పనిచేస్తానని ప్రకటించారు. ఇదే తరహాలో కేటీఆర్ సైతం కవిత నివాసానికి వెళ్లి శాంతిపజేస్తారా? అనేది కూడా ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. లేకుంటే ఫాం హౌజ్ కు పిలిపించి కేసీఆర్ ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతారా? అనేది కూడా చర్చకు దారితీసింది. లేకుంటే ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనేది పార్టీ నేతలు సైతం చర్చించుకుంటున్నారు.
Also Read: Vijayashanti: రాములమ్మకు మంత్రి పదవి ఫిక్స్.. ఏరికోరి మరీ ఎందుకో?
ఎవరికివారుగా ప్రజల్లోకి వెళ్తారా?
పార్టీ అధినేత కేసీఆర్ ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చుతారా? లేకుంటే ఎవరికి వారుగా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు ఇస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే కవిత జాగృతి పేరుతో కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది. మరోవైపు జాగృతి బలోపేతంపైనా దృష్టిసారించి కమిటీలను వేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తరుపున కేటీఆర్, జాగృతి నుంచి కవిత ఇద్దరు వేర్వురుగా ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై గళ ఎత్తనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అటైన్షన్ డైవర్షన్ రాజకీయాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం సైతం జరుగుతుంది. ఎవరికి వారుగా వెళ్తే నిత్యం ప్రజలను తమవైపునకు తిప్పుకోవచ్చనే ప్రయత్నాలు సైతం చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ నెల రెండో వారం నుంచి బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదుతో పాటు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఏది ఏమైనా కవిత ఎపిసోడ్ కు తెరదించుతారా? లేకుంటే పట్టించుకోనట్లు వ్యవహరిస్తారా? అనేది చూడాలి.
Also Read: Madhu Yashki On Kavitha: జాగృతిలో భారీ స్కామ్.. రూ.800 కోట్లు హాంఫట్.. కవితపై ఆరోపణలు!