Pawan Kalyan: అవును.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై నెలలో 15 రోజులపాటు.. రోజూ రెండు పూటల అంటూ చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీపై ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘ పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి, ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతోమంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులుపడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేది. మిగిలిన రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపింది’ అని పవన్ వెల్లడించారు.
Read Also- Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని వంశీ గుడ్ బై.. రంగంలోకి మేడమ్!
అక్రమాలకు అడ్డుకట్ట!
‘వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుంది. వీటిని అరికట్టేందుకు, ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందించనున్నాం. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా, ప్రతీ ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జనరంజకంగా అమలవుతుందని ఆకాంక్షిస్తున్నాను. ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Read Also- Tollywood: పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ వేసిందెవరు?.. వైసీపీ కీలక నేత రివెంజేనా?
పిఠాపురం నుంచి షురూ..
పిఠాపురంలో చౌక ధరల దుకాణంను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ, ఆదివారం నుంచి చౌక ధరల దుకాణాలను పునః ప్రారంభం చేస్తున్నది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చౌక ధరల దుకాణాలు మొదలవుతున్నాయి. పిఠాపురం పట్టణం 18వ వార్డులో చౌక ధరల దుకాణాన్ని నాదెండ్ల ప్రారంభిస్తారని జనసేన అధికారిక ప్రకటన చేసింది. అనంతరం సకిలేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. పిఠాపురం ఎఎంసీ ఛైర్మన్ పదవి బాధ్యతల స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరవుతారు.
రేషన్ వద్దనుకుంటే..
ఇదిలా ఉంటే.. రేషన్ బియ్యం వద్దనుకునే వారికి సీఎం చంద్రబాబు ఒకింత తీపి కబురే చెప్పారు. రేషన్ బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తామని ప్రకటించారు. జూన్ నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం పంపిణీ తిరిగి ప్రారంభమవుతుందని.. ఎవరికైతే రేషన్ వద్దో, వారికి డబ్బులు డీబీటీ ద్వారా అందుతాయని సీఎం తెలిపారు. దీనివల్ల రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటికే బియ్యం పంపిణీ చేస్తారని అంబేడ్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. కాగా, కిలో బియ్యానికి ఎంత డబ్బు వస్తుంది? ప్రభుత్వం నిర్ణయించే ధరలు ఎలా ఉంటాయి? అనే దానిపై మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ ప్రక్రియ ద్వారా రేషన్ అక్రమ రవాణాకు అరికట్టవచ్చని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
పారదర్శకత పెంచడానికి..
గతంలో ఇంటింటికీ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరిగేదన్న విషయం తెలిసిందే. అయితే, 2025 జూన్ 1 నుంచి తిరిగి రేషన్ షాపుల (చౌక ధరల దుకాణాలు) ద్వారానే రేషన్ పంపిణీ జరుగనున్నది. తద్వారా పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, మూడు నెలల రేషన్ బియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు నెల వరకు లబ్ధిదారులకు బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. రేషన్ బియ్యాన్ని వినియోగించుకోని అనర్హులను గుర్తించి, వారి కార్డులను తొలగించడం ద్వారా అర్హులకు మరింత నాణ్యమైన సేవలు అందించవచ్చు అనే వాదన కూడా ఉంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉన్నది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో త్వరలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జూన్ 7 నుంచి ఉండొచ్చని సమాచారం.
Read Also- Natti Kumar: నారాయణమూర్తి నీ బుద్ధి ఏమైంది?.. నట్టి కుమార్ ఫైర్