Natti Kumar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్‌లపై విప్లవ చిత్రాల నటుడు ఆర్. నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను సీనియర్ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు సంబంధించి తలెత్తిన థియేటర్ల వివాదం విషయమై.. ఆర్ నారాయణమూర్తి మీడియా సమావేశం నిర్వహించి విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ పీపుల్ స్టార్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆ మాటలపై హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శనివారం సాయంత్రం నట్టి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ.. ఆర్. నారాయణమూర్తితో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. పేదల పక్షాన నిలిచే ఆయన అంటే నాకు మొదటి నుంచి ఎంతో గౌరవం ఉంది. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయం నుంచి ఆయన వైఖరిలో చాలా మార్పు వచ్చింది. వైసీపీ వాళ్లు ఎలాంటి అరాచకాలు చేసినా, సినీ పరిశ్రమకు ఎలాంటి మేలు చేయకపోయినా.. వారికి వత్తాసు పలుకుతూ వస్తుండటం ఆయనలోని మార్పు ఎవరికైనా ఇట్లే అర్ధమయ్యేలా చేస్తుంది. గతంలో అప్పటి సీఎం జగన్ సినీ పరిశ్రమ కోసం మీటింగ్ పెట్టినప్పుడు, ఆ మీటింగుకు చిరంజీవి, మహేష్, ప్రభాస్ వంటి పలువురు పెద్ద హీరోలు వెళ్లారు. ఆర్ . నారాయణమూర్తి కూడా వెళ్లారు. ఆ రోజు చిరంజీవి వంటి పెద్దలను అవమానపరచినపుడు ఆయన ఎక్కడున్నారు, ఏం మాట్లాడారు?
Also Read- Sekhar Kammula: మెగాస్టార్ చిరంజీవితో.. ఎమోషనల్ మెసేజ్ వైరల్!
ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న చిన్న సినిమాలకు ఐదో షో ఇప్పించగలిగారా? జగన్ హయాం, కేసిఆర్ హయాంలో వారికి దగ్గరగా ఉన్నప్పుడు మీరెందుకు స్పందించలేదు. ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల జూన్ 12వ తేదీని ముందుగానే ప్రకటించినప్పుడు, మూడు వారాలు ముందుగా నోటీసు లేకుండా థియేటర్ల బంద్ ఎలా ప్రకటిస్తారు? ఈ విషయం ఆర్ నారాయణమూర్తికి తెలియంది కాదు. కానీ కార్పొరేట్ శక్తుల కుట్ర కోణంలో నారాయణమూర్తి బందీ అయ్యారు. అందుకే వెనకా ముందూ ఆలోచించకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా.. ఆయన పవన్ కళ్యాణ్, దుర్గేష్‌లపై అనవసర విమర్శలు చేస్తున్నారు. ఏ కార్పొరేట్ శక్తులు ఆయనతో ఈ ప్రెస్ మీట్ పెట్టించారో నాకు తెలుసు.
ఆర్. నారాయణమూర్తి నా మాటలను ఖండిస్తే, ఆ విషయాలన్నీ నేను బయటపెడతాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో థియేటర్ క్యాంటీన్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు.. టిక్కెట్ల రేట్ల కంటే ఎంత ఎక్కువగా ఉన్నాయో తెలియంది కాదు. అప్పట్లో ఆ ప్రభుత్వంలో పోసాని కానీ, మీలాంటి వాళ్లు కానీ ఏమీ చేయలేకపోయారు, కనీసం మాట్లాడలేకపోయారు. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ఆ సమస్యల గురించి చర్చిస్తాం, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తామంటే ఆయనను విమర్శించడం ఎంతవరకు సమంజసం. రాజకీయాలు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు.
Also Read- Sri Sri Sri Rajavaru: ఎన్టీఆర్ బావమరిది మొదటి సినిమా విడుదలవుతోంది
నిజమే.. థియేటర్ల బంద్ బ్రహ్మాస్త్రం వంటిది.. కానీ దానికి ఓ పద్ధతి ఉంటుంది. జగన్ చిన్న సినిమాలకు అసలేం చేశారో నారాయణమూర్తి చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మీరు గుత్తాధిపత్యాన్ని ఎందుకు సమర్దిస్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలి. మీ భావాలు మారడమే ఇందుకు నిదర్శనమని అంతా అంటున్నారు. సమస్యలను తీర్చాల్సింది ఫిలిం ఛాంబర్ , ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కదా! అది కూడా మీకు తెలీదా! ఎందుకు కావాలని పవన్ , దుర్గేష్‌లను టార్గెట్ చేశారు. జగన్ ఆ రోజు రూ. 5 కు, రూ. 35కు టికెట్ రేట్లు ప్రకటిస్తే మీరు ఏం చేశారు? ఇంకొక నిర్మాత, జనసేన నాయకుడు అంటూ ఓ ఎగ్జిబిటర్ గురించి కామెంట్స్ చేశారు. కావాలనే మీరు జనసేన పార్టీ పేరు తెస్తున్నారు.. ఆ నలుగురు వల్లే ఎవరికి న్యాయం జరగటం లేదు.
ఈ రోజుకూ చిన్న సినిమాలకు ఐదో షో రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో భారీ రేట్లకు టిక్కెట్లు, పుడ్ అమ్ముతుంటే మీరు ఎందుకు ప్రశ్నించటం లేదు? గత ఐదేళ్లు మీరు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టారు. ఆరోజు మీరు వాళ్లను ఎందుకు అడగలేదు. నిజమైన ఎగ్జిబిటర్ నష్టపోతుంటే మాట్లాడరు. పని కట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని, పవన్‌ను విమర్శిస్తున్నారు. ఆ రోజు, ఈ రోజు చిన్న సినిమాలకు సపోర్ట్‌గా మాట్లాడింది నేనే. దయచేసి మీరు ఏం మాట్లాడారో.. ఎవరి గురించి మాట్లాడారో ఒక్క ఆత్మ విమర్శ చేసుకోండని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు