Collector Anudeep durishetty: గర్భస్త శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ లో అర్హులైన డాక్టర్లు, అనుమతి పొందిన స్కానింగ్ మిషన్లు మాత్రమే ఉండాలని, మార్పులు ఉంటే వెంటనే హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి తెలియజేయాలని, నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా అప్రోప్రీట్ అథారిటీ కమిటీ పీసీపీ ఎన్డీటి చట్టం సమీక్ష సమావేశంలో, జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ కేంద్రాలు విధిగా నిర్దేశించిన రూల్స్ ప్రకారము నిర్వహించాలని స్కానింగ్ చేయించుకున్న గర్భిణీ స్త్రీల వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్ లో నమోదు చేసి, అదే రోజు ఆన్ లైన్ లో వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. జిల్లాలో స్టేట్ మానిటరింగ్,జిల్లా తనిఖీ బృందాలు నిర్వహించిన తనిఖీలో సికింద్రాబాద్ లోని న్యూ లైఫ్ ఆసుపత్రిలో అనుమతి లేని స్కానింగ్ మిషన్ ను గుర్తించి సీజ్ చేసి యాజమాన్యంపై చట్టరీత్యా కోర్టులో కేసు నమోదు చేయాలని, సైదాబాద్ లోని వివేకాసుపత్రిలో అనుమతి లేకుండా ఉన్న రెండు స్కానింగ్ మిషన్లు గుర్తించినందుకు రూ. 2లక్షల జరిమానా విధించాలని కలెక్టర్ ఆదేశించారు.
Also Read: Swetcha Special story: చదువే జీవన గమనాన్ని మార్చుతుంది.. ఎస్పీ పై స్వేచ్ఛ ప్రత్యేక కథనం!
జిల్లాలో సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు నిర్వహించిన తనిఖీలో నిబంధనలు ఉల్లంఘించిన 26 స్కానింగ్ సెంటర్లకు ఒక్కోదానికి రూ. 50 వేలు చొప్పున జరిమానా విధించి వసూలు చేయాలన్నారు. తిరిగి అదే విధంగా నిబంధనలు అతిక్రమించినట్లయితే స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలన్నారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు ,జిల్లా ప్రోగ్రాం అధికారులు జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను నిరంతరం తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి జరిమానా విధించాలని సూచించారు.
గర్భస్త శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలు, వీటికి సంబంధించిన సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ 18005993366 ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పిర్యాదు చేయాలని, దీనిపై చట్టంపై అవగాహన సదస్సులు, ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చట్టంపై అన్ని ప్రభుత్వ కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. వెంకటి జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టము అమలుపై, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై, నిబంధనలు ఉల్లంఘించిన స్కానింగ్ సెంటర్ల పై తీసుకోనున్న చర్యలపై, స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహించిన అవగాహన సదస్సులపై నివేదిక సమర్పించారు. ఈ సమీక్షా సమావేశంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వందన, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు, టి. నరసింహ, అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Harish Rao on Congress: అవినీతిని ఆధారాలతో బయటపెడ్తాం.. మాజీ మంత్రి కామెంట్స్!