Harish Rao on Congress: త్వరలోనే కాంగ్రెస్ అవినీతి బండారాన్ని పూర్తి ఆధారాలతో బయటపెడతాం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం చేతకాని అసమర్ధ రేవంత్ సర్కారు హిమాచల్ ప్రదేశ్ లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడం అన్యాయమన్నారు. అప్పులు పుట్టడం లేదని, తమను ఎవరు నమ్మడం లేదని ప్రతీ వేదిక మీద చెబుతున్న రేవంత్ కు 6,200 కోట్లతో హిమాచల్ ప్రదేశ్ లో తెల్ల ఏనుగు లాంటి హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి టీజీ జెన్ కో ను రంగం లోకి దింపడం ఇంకో తుగ్లక్ చర్య తప్ప మరొకటి కాదు అన్నారు.
ఆ హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి మోసర్ బేర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీ పారిపోయినా, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ కంపెనీ 3 ఏండ్ల తర్వాత సాధ్యం కాదని వదిలేసిన 510 మెగావాట్ల ప్లాంట్ ని కట్టేందుకు టీజీ జెన్ కో ఒప్పందం ఎందుకు చేసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాల కాలంలో ఒక్కరు కూడా కట్టేందుకు ముందు రాని ప్రాజెక్ట్ ను ఎందుకు నేడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టవలసి వస్తోంది? అని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండానే తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రభుత్వం తో ఎంవోయూ చేసుకొని అప్ ఫ్రంట్ ప్రీమియం కింద 26 కోట్లు చెల్లించి మరో 26 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడడాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసిందని సీఎం చెపుతున్న మాటలు ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికేనని తేలిపోయాయన్నారు.
Also Read: Chamala Kiran Kumar: కవితకు కాంగ్రెస్ నేత ఆఫర్.. అలా చేస్తే కలిసి వస్తా.. ఎంపీ చామల
2009లోనే మోసర్ బేర్ కంపెనీ 64 కోట్ల అప్ ఫ్రంట్ ప్రీమియం చెల్లించి హిమాచల్ ప్రదేశ్ లోని ప్రతిపాదిత సేలి, మియార్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టాలని భావించిందని, కానీ సాంకేతికంగా, ఆర్థికంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుందన్నారు. చెల్లించిన 64 కోట్ల ప్రీమియంను హిమాచల్ ప్రభుత్వం తిరిగి ఇవ్వనందుకు ఆ రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించగా హిమాచల్ హైకోర్టు మోసర్ బేర్ కంపెనీకి వడ్డీతో సహా తీసుకున్న డబ్బును 2023 జనవరిలోనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందన్నారు.
10 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్..హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఢిల్లీలోని హిమాచల్ భవన్ ను వేలం వేసి ఆ డబ్బును కంపెనీకి చెల్లించాలని 2024 నవంబర్ లో హైకోర్టు ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. 7 నెలలకు పైగా అత్యధికంగా మంచు కురిసే ప్రాంతంలో హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ సాధ్యం కాదని 2019లో ఒప్పందం చేసుకున్న కేంద్ర ఎన్టీపీసీ కూడా చేతులు ఎత్తేసి ఒప్పందాన్ని రద్దు చేసుకుందన్నారు. అలాంటి ప్రాంతంలో 6,200 కోట్ల ప్రాథమిక అంచనాతో 510 మెగా వాట్ల హైడ్రల్ ప్రవర్ ప్రాజెక్టులకు ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఉబలాటపడుతుందో శ్వేతా పత్రం విడుదల చేయాలని భట్టి విక్రమార్కని డిమాండ్ చేశారు.
ఫీజిబిలిటీ రిపోర్ట్లు, డీపీఆర్ లు లేకున్నా, జెన్ కో బోర్డు ఆమోదం లేకున్నా కూడా ఎంవోయూ చేసుకొని 26 కోట్లు ఎందుకు చెల్లించారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని, అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. సాధ్యం కాదు అని 20 ఏండ్లుగా కట్టని ప్రాజెక్టును ఎవరి లాభం కొరకు, ఎవరి మెప్పు కొరకు కడుతున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలనికోరారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని నిర్దిష్టమైన సమాచారం మా వద్ద ఉందని ఆధారాలతో బయటపెడ్తామన్నారు.
Also Read: Indiramma Houses: అర్హతను బట్టి ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి సంచలన వాఖ్యలు!