Nara Lokesh: పసుపు పండుగ మహానాడు చివరి రోజున భారీ బహిరంగ సభలో టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ముఖ్యంగా వైసీపీని (YSRCP) టార్గెట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ ప్రశ్నలకు కానీ, కామెంట్లకు కానీ వైసీపీ కౌంటర్ చేస్తుందా..? ఆ సాహసం చేస్తుందా? అనేది ప్రశ్నార్థకమే. ‘ నేను ఈరోజు దేవుని గడప సాక్షిగా రాయలసీమ ప్రజలను కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నా.. రెడీనా..? తల్లిని, చెల్లిని మెడ పట్టుకొని గెంటేసిందెవరు? ఎవరు? సొంత బాబాయ్‌ని లేపేసిందెవరు? జే బ్రాండ్‌లు అమ్మి పేదల రక్తం తాగిందెవరు? బల్లకింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజలను బాదింది ఎవరు? (జగన్.. జగన్ (YS Jagan) అంటూ సభకు హాజరైన కార్యకర్తలు, అభిమానుల నుంచి రియాక్షన్) ఎర్ర బుక్కు, ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పిందేంటి? ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో.. వారిపై చట్టపరంగా యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. ఈరోజు ఎర్ర బుక్కు కాదు కదా..? ఎర్ర కలర్ (తడబడుతూ..) ఎర్ర రంగు చూసినా వణికిపోయే పరిస్థితి వస్తోంది. ఎర్రబుక్కు అంటే ఒకడికి గుండె పోటు వచ్చింది.. ఎర్రబుక్ అంటేనే ఒకడు బాత్ రూమ్‌లో జారిపడి చెయ్యి విరిగొట్టుకున్నాడు.. ఇంకొకడు ఏం అయ్యాడో కూడా తెలీదు.. అర్థమైందా రాజా?, అర్థమైందా రాజా? రాయలసీమ గడ్డా టీడీపీ అడ్డా’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.
Read Also- Nara Lokesh: నారా లోకేష్ నోట అల్లు అర్జున్ డైలాగ్.. మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి!
పసుపుసైన్యమే మన బలం
‘ విష మద్యంతో 30వేల మంది అమాయకులను గత ప్రభుత్వం బలిగొన్నది. విధ్వంస పాలనతో అన్నపూర్ణను అప్పులప్రదేశ్‌గా మార్చేశారు! మన జెండా పీకేస్తాం అన్నోళ్లు అడ్రస్ లేకుండా పోయారు. వైనాట్ 175 అన్నారు. తీరా చూస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసు. ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడే పసుపు సైన్యమే మన బలం. తెలుగుజాతిని ప్రపంచపటంలో నిలిపిన సీబీఎన్ బ్రాండ్. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్న ఎన్టీఆర్. ఏడాదిలోనే రూ.8.5లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. ప్రభుత్వ కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. రెడ్ బుక్ కాదు (Red Book) కదా, రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లేదు. పౌరుషాల గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. 175 నియోజకవర్గాలకు గాను 164 సాధించాం. ఇది ఆల్ టైం రికార్డ్. జెండా పీకేస్తాం అన్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుకే టూలేట్ బోర్డు పెట్టారు. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు కానీ, ఇప్పుడు ప్రజలే ఫుట్ బాల్ ఆడుతున్నారు. మన నాయకుడు చంద్రబాబును అరెస్టు చేశారు.. ఇప్పుడు ఆ నాయకుడిని ప్యాలెస్‌లో పెట్టి ప్రజలు తాళాలు వేశారు. సీబీఎన్ అంటే డెవలప్మెంట్. సీబీఎన్ అంటే సంక్షేమం. సీబీఎన్ అంటే మనందరి ధైర్యం’ అని లోకేష్ వెల్లడించారు.
పవన్ గురించి..
‘ నా పైన కూడా 23 కేసులు పెట్టారు తగ్గేదే లేదని ఆనాడే చెప్పాం. విధ్వంసం పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఒక్క కంపెనీ కూడా తీసుకురాక పోగా, ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రాలకు వెళ్లేలా చేశారు. పవన్ కళ్యాణ్ నాకు అన్నతో సమానం. ఆయన పార్టీ జెండాలు, అజెండాలు పక్కన పెట్టి మరీ మన కోసం పని చేశారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సును నా అక్కా చెల్లెమ్మలకు కల్పిస్తున్నాం. అలాగే, 16 వేల మందితో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ఉద్యోగుల సమస్యలు అన్నింటినీ పద్ధతి ప్రకారం కూటమి సర్కార్ తప్పకుండా పరిష్కరిస్తుంది. 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయి. వైసీపీ హయాంలో ఇబ్బంది పడ్డ కుటుంబాలను కలుస్తున్నాను. వైసీపీ కార్యకర్తల్లారా ఏనాడైనా మీ నాయకుడు కలిశారా? 25 ఎంపీ స్థానాల్లో కూటమి 21 స్థానాల్లో గెలిచింది. మూడు పార్టీలు కలిసి ఉన్నప్పుడు చిన్నపాటి సమస్యలు సహజంగానే ఉంటాయి. మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు ఉండకూడదు. ఈగోలు వదిలి పెట్టాలి. ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం’ అని రాష్ట్ర ప్రజలకు లోకేష్ విజ్ఞప్తి చేశారు. కాగా, యువనేత ప్రసంగంపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఏయే లీడర్లు మీడియా ముందుకొచ్చి కౌంటర్లు ఇస్తారో? అసలు అంత సాహసం చేస్తారా? మరీ ముఖ్యంగా ఈ మధ్యనే కడపలో మహానాడు నిర్వహణపై మాట్లాడిన జగన్.. ఇప్పుడు లోకేష్ కామెంట్స్‌కు స్పందన ఎలా ఉంటుంది? అనేది చూడాలి మరి.
Read Also- Narsi Reddy: ఎవరీ నన్నూరి నర్సిరెడ్డి.. చంద్రబాబుకు ఎందుకంత ఇష్టం?