Narsi Reddy: నన్నూరి నర్సిరెడ్డి.. ఈయన నోరు తెరిస్తే ప్రత్యర్థులపై పంచ్‌లు, సెటైర్లు. ఇక షురూ చేసుకుంటూ పోతే పిట్ట కథలు, ఆ ప్రాసకు కడుపుబ్బా నవ్వులే నవ్వులు. మాట్లాడుతున్నంత సేపు నవ్వు ఆపుకోలేం అంతే. వేదికపై ఉన్న పెద్దలకు, విచ్చేసిన జనం, కార్యకర్తలకు పండగే పండగ.. నవ్వి, నవ్వి ఏడ్చేస్తారు అంతే. అలా ఉంటుంది నర్సిరెడ్డి ప్రసంగం. ఎంతసేపూ ఈయన చేసే ప్రసంగం వింటుంటారో కానీ.. ఇంతకీ ఎవరీ నర్సిరెడ్డి, టీడీపీకి ఈయనకు ఏంటి సంబంధం..? ఏ సభలో చూసినా ఎందుకు ఈయన కనిపిస్తుంటారు? టీడీపీ అధినేత చంద్రబాబుకు నర్సిరెడ్డి అంటే ఎందుకంత ఇష్టం? అనేది మీలో ఎందరికి తెలుసు..? అంటే చాలా మందికి తెలియదు కదా.. అందుకే నర్సిరెడ్డిపై ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం అందిస్తోంది.. ఇక ఆలస్యమెందుకు చకచకా ఈ కథనం చదివేయండి మరి. అంతేకాదండోయ్.. తాజాగా కడపలో జరుగుతున్న మహానాడు-2025లో నర్సిరెడ్డి ఏమేం మాట్లాడారు? ఈసారి ఏం పంచ్‌లు వేశారు? అనే విషయాలు కూడా తెలుసుకుందాం రండి..
ఎవరీ నర్సిరెడ్డి..?
నర్సిరెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. యాదాద్రి భువనగిరి జిల్లా సిరిపురం స్వగ్రామం. 1996లో టీడీపీ విద్యార్థి విభాగం టీఎన్‌ఎస్‌ఎఫ్ (TNSF) లో చేరారు. నాటి నుంచి నేటి వరకూ కష్టమైనా, నష్టమైనా.. పదవులున్నా, లేకున్నా పార్టీ మారకుండా, వేరే కండువా మార్చకుండా టీడీపీలోనే కొనసాగుతున్నారు. కొన్నేళ్లకు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీకి సేవలు అందించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో తెలంగాణలో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కరంటే ఒక్కరూ ఎమ్మెల్యేలు, నేతలు, ఆఖరికి ద్వితియ శ్రేణి నేతలు సైతం సైకిల్ దిగి, కారు పార్టీ, కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. అయితే నర్సిరెడ్డి మాత్రం తగ్గేదేలే అంటూ అదరక, బెదరక టీడీపీలోనే ఉండిపోయారు. మంచి వక్త.. పంచ్‌లు, ప్రాసలో పండిపోయిన వ్యక్తి. బహుశా ఇప్పుడున్న ఈ యువతలో ఈయన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా మాటలు ఉంటాయి. టీడీపీకి సంబంధించి ఎలాంటి సభలు జరిగినా, మరీ ముఖ్యంగా మహానాడు అయితే కచ్చితంగా నర్సిరెడ్డి ఉంటారు. సభలు, సమావేశాల్లో ఈ యంగ్ లీడర్‌కు తక్కువలో తక్కువ 5 నుంచి 10 నిమిషాల పాటు ప్రసంగానికి పార్టీ పెద్దలు సమయం ఇస్తుంటారు. ఈ గ్యాప్‌లో విమర్శలు, పంచ్‌లు, సెటైర్లు, ప్రాసలతో నవ్వులే నవ్వులు. ఒక్క మాటలో చెప్పాలంటే నర్సిరెడ్డి ప్రసంగం వినడానికే సభలు, సమావేశాలకు యువత క్యూ కడుతుంటారంటే.. ఆయనకున్న ఫ్యాన్ పాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కడపలో జరుగుతున్న మహానాడుకు విచ్చేసిన ఈయన అబ్బో.. ‘నర్సిరెడ్డా మజాకా’ అన్నట్లుగా ప్రసంగం ఇరగదీశారు. గుక్కతిప్పుకోకుండా నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకున్నారు.
Read Also- YS Jagan: కడపలో మహానాడుపై వైఎస్ జగన్ ఫస్ట్ రియాక్షన్.. ఇంత మాట అన్నారేంటో?
మా కాడ ముక్కోడు.. మీ కాడ తిక్కోడు!
‘ చెట్టుపైన కూర్చున్న పక్షి కొమ్మ ఏ బలాన్ని నమ్ముకోదు. దాని రెక్కల బలాన్ని మాత్రమే నమ్ముకుంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తల బలాన్ని, బలగాన్ని మాత్రమే నమ్ముకుంటుంది. కార్యకర్తలే ఈ పార్టీకి ఇంధనం. అందుకే మీకు నా వందనం. అద్భుతమైన వాతావరం ఉంది. మొన్నటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఒకరకంగా ఉండే. మా కాడ ముక్కోడు (కేసీఆర్) పోయిండు.. మీ కాడ తిక్కోడు (వైఎస్ జగన్) పోయిండు. ముక్కాయన లిఫ్ట్ ఇరిగేషన్, తిక్కాయన ఆత్మలతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని.. అధికారంలో ఉంటే ప్రజలకు చేయవల్సిన దాని గురించి.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై మాట్లాడే ఈ మహానాడు వేదికపై, మహత్తరమైన వేదికపై తెలుగు జాతి-విశ్వ ఖ్యాతి అనే అంశంపైన తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు. ఢిల్లీ వీధుల్లో దిగజారుతున్న తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించేందుకు ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారు. పేదల కోసం, బీదల కోసం ఎన్టీఆర్ నాడు టీడీపీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టింది. భారతదేశ రాజకీయాల్లో సంచనాలను సృష్టించింది. ప్రాంతీయ పార్టీగా ఉండి భారత పార్లమెంట్‌లో ప్రతిపక్ష స్థాయిలో ఉండగలమని నిరూపించింది. భారత ప్రధానులు, రాష్ట్రపతుల ఎన్నికల్లో కూడా ప్రధాన భూమిక పోషించిన చరిత్ర టీడీపీది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ప్రజలలో రాజకీయ చైతన్యం వచ్చింది. గ్రామాలకు మౌలిక సదుపాయాలు అందాయి. ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరాయి’ అని నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు.
నవ్వులే.. నవ్వులు..!
నర్సిరెడ్డి అంటే చంద్రబాబుకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ప్రసంగం, ప్రాస, పంచ్‌లు, సెటైర్లకు ఎన్నో సభల్లో, సమావేశాల్లో అధినేత పగలబడి మరీ నవ్వుకున్న రోజులు ఉన్నాయి. అందుకే టీడీపీ సభ అంటే చాలు నర్సిరెడ్డికి కచ్చితంగా ఆహ్వానం ఉంటుంది. మరీ ముఖ్యంగా టీడీపీ ప్రత్యర్థులుగా ఉన్న కేసీఆర్, వైఎస్ జగన్‌లను ఉద్దేశించి ఆయన చెప్పే పిట్ట కథలు టీడీపీ క్యాడర్‌లో ఎనలేని జోష్ నింపుతుంటాయి. అలా టీడీపీ భక్తుడిగా, వీర విధేయుడిగా.. చంద్రబాబు అంటే ప్రాణంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నర్సిరెడ్డికి వివిధ హోదాలు దక్కాయి. ప్రస్తుతం ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో సభ్యునిగా అవకాశం కల్పించారు. అయితే దైవ సన్నిధానంలో ఒక హోదాలో ఉండే వ్యక్తి ఇలాంటి పాడు మాటలు, పాడు పనులు చేయొచ్చా? అని ప్రశ్నించే వాళ్లు లేకపోలేదు. ఇక బీఆర్ఎస్, వైసీపీ నుంచి విమర్శలు, వార్నింగ్‌లు అంతకుమించే ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల కింద పెద్ద ఎత్తున హెచ్చరికలు, చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ కూడా ఉన్నాయి.
Read Also- Mahanadu 2025: టీడీపీలో కోవర్టులు.. స్వయంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు