Central on Kharif Crops: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినేట్ భేటి (Central Cabinate Meet) అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. క్యాబినేట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియాకు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ (Kharif Season) లో వరి సహా 14 పంటల మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ఇందుకోసం రూ.2 లక్షల 70వేల కోట్లు కేంద్రం కేటాయించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఏ పంటకు ఎంతంటే?
వరి సహా మొత్తం 14 ఖరీఫ్ పంటలకు క్వింటాల్‌పై కనీస మద్దతు ధర(MSP) ను కేంద్రం పెంచింది. ఇందులో భాగంగా వరి గ్రేడ్- ఏ రకంపై రూ.69 పెంచగా.. దాని ధర రూ.2,369కి చేరింది. అలాగే జొన్నపై రూ.328 పెంచడంతో క్వింటా ధర రూ.3,699 అయ్యింది. సజ్జలపై రూ.150 పెరిగి.. ధర రూ.2,775కి చేరింది. రాగులపై రూ.596 పెరిగి ధర రూ.4,886 అయింది. వేరుశెనగ రూ.480 పెరిగి క్వింటాల్ ధర రూ. 7,263 చేరింది.
వాటికి సైతం మద్దతు ధర పెంపు
మెుక్క జొన్న పై రూ.175 (క్వింటా రూ. 2,400), పెసర్లపై రూ.86 (క్వింటా రూ.8,768), మినుములపై రూ.400 (క్వింటా రూ.7,800) పెరిగింది. అలాగే పొద్దు తిరుగుడుపై రూ.441 పెంచడంతో క్వింటా ధర రూ. 7,721 చేరింది. సోయాబిన్ పై రూ.436 పెరిగి రూ.5,328 అయింది. పత్తిపై క్వింటాకు రూ.589 పెంచడంతో ధర రూ.8,110 చేరింది. కుసుములు రూ.579, ఒలిసెలు రూ.589 మేర క్వింటాకు ధర పెరిగింది.
Also Read: Harish Rao – KCR: కాళేశ్వరం టెన్షన్.. కేసీఆర్‌తో హరీష్ మళ్లీ భేటి.. ఈ అంశాలపై చర్చ!
ఏపీ గురించి కీలక నిర్ణయం
మరోవైపు ఏపీలోని బద్వేల్- నెల్లూరు నాలుగు వరుసల రహదారి అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108.134 కి.మీల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. బద్వేల్‌లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు నాలుగు వరుసల రోడ్డును కేంద్రం నిర్మించనుంది. ఈ కారిడార్ ద్వారా కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనుంది. అలాగే ఈ కారిడార్ నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం తెలిపింది.