Sr NTR Speech: కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రెండో రోజైన ఇవాళ ఎన్టీఆర్ ఏఐ వీడియో (N T Rama Rao) ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ వివిధ అంశాలపై ఎన్టీఆర్ మాట్లాడుతున్నట్లు వీడియోను రూపొందించారు. ఈ వీడియోను చూసి తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోతున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు కిందకి దిగి వచ్చి టీడీపీ కార్యక్రమాలను ప్రశంసిస్తున్నట్లుగా ఉందని ఆకాశానికెత్తుతున్నారు. అంతేకాదు అటు సోషల్ మీడియా వేదికగానూ ఈ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఎన్టీ రామారావు చేసిన వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
స్పీచ్ ఎలా మెుదలైందంటే!
కడపలో జరుగుతున్న మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగాన్ని ప్రదర్శించారు. ‘మహా వేడుకలా.. నింగి నేలా పసుపు మయమై పరవశించేలా.. అంగరంగ వైభవంగా జరుగుతోన్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్లకు.. ఆడపడుచులకు, రైతన్నలకు, శ్రమజీవులకు, దేశవిదేశాల్లో తెలుగు కీర్తిపతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు హృదయపూర్వక నమస్సుమాంజలి’ అంటూ ఎన్టీఆర్ తన ప్రసంగం ప్రారంభించారు. ముఖ్యంగా పసుపు జెండాను గుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
మహానాడు వేదికగా అన్న ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు వివిధ అంశాలు ప్రస్తావన.#NTRLivesOn#Mahanadu2025#TeluguDesamParty #AndhraPradesh pic.twitter.com/RvPN1R9eah
— Telugu Desam Party (@JaiTDP) May 28, 2025
వారి కోసమే టీడీపీ పుట్టింది!
తెలుగు వారి కోసం, వారి ఆత్మగౌరవం కోసం పార్టీ స్థాపించి 43 ఏళ్లు అవుతోందని ఏఐ వీడియోలో ఎన్టీఆర్ అన్నారు. తాను స్థాపించాను అని చెప్పడం కన్నా పార్టీ పుట్టిందని చెప్పడమే సబబుగా ఉంటుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు. కార్మికుల చెమట, కర్షకుల రక్తం, పీడిత ప్రజల బాధల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిందని పేర్కొన్నారు. కులమతాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగు దేశం పుట్టిందని చెప్పారు. పేదలకు అవసరమైన పూటకు పట్టెడు అన్నం, తల దాచుకోవడానికి పక్కా ఇల్లు, గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం, రైతన్నలకు సంక్షేమం ఇలా వాటన్నింటిన అందించడం కోసం మెుదలైన తెలుగు దేశం ప్రస్తావనం.. ఎన్నో మలుపులు తిరిగిందని అన్నారు. కొత్త జగతికి, అపూర్వ ప్రగతికి బాటలు వేసిందని చెప్పారు.
ఆర్థిక ప్రగతికి సంతృప్తిగా ఉన్నా
హైదరాబాద్, సికింద్రాబాద్ లకు ట్యాంక్ బండ్ తో తాను సాంస్కృతిక వారధి కట్టానని ఏఐ వీడియోలో స్వర్గియ ఎన్టీఆర్ అన్నారు. తన తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని సృష్టించి ఆధునిక ప్రపంచానికి, సాంకేతిక వారధిని కట్టించిన వారు చంద్రబాబు అని కొనియాడారు. రూ. లక్షల జీతం గురించి ఏనాడైనా కలగన్నామా? దానిని సాధ్యం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చాటి చెప్పేందుకు తాను గర్వపడుతున్నట్లు ఎన్టీఆర్ అన్నారు. డ్వాక్రా పథకంలో ఆడపడుచులు సాధించిన ఆర్థిక ప్రగతిని చూసి తనకు సంతృప్తిగా ఉందని చెప్పారు. పోలవరం గురించి గోదావరిని కృష్ణమ్మతో అనుసంధానం, పోలవరం కోసం ఆనాడు తాను ఎంతో పరితపించానని ఎన్టీఆర్ చెప్పారు. అయితే పట్టిసీమతో ఒకటి నేరవేరిందని.. పోలవరం పూర్తి రెండేళ్లలో నెరవేరబోతుందని చెప్పారు.
అసూయపడేలా రాజధాని ఉండాలి!
రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే పేదల కోసం ఆనాడు కిలో రూ.2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు రామారావు స్పష్టం చేశారు. అటువంటిది పీ 4 కార్యక్రమంతో పేదలకు పేదరికం నుంచి విముక్తి కలిగించి, బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అమోఘం, మహా అద్భుతమని ప్రశంసించారు. శాతవాహనుల రాజధానిగా ఒకప్పుడు విరాజిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని అందరూ అసూయపడేలా రూపుదిద్దుకోవాలని మనసారా కోరుకుంటున్నట్లు ఎన్టీఆర్ చెప్పారు. సమాజ నిర్మాణం కోసం క్రమశిక్షణ కలిగిన యువతను తీర్చిదిద్దాలని ఆనాడు తాను కలలు కన్నట్లు ఎన్టీ రామారావు అన్నారు. యువగళానికి ప్రాధాన్యం ఇచ్చి, యువశక్తికి పదును పెట్టి.. తన కలలను మనవడు నారా లోకేష్ తీరుస్తున్నాడని ప్రశంసించారు.
Also Read: Cm Revanth Reddy: బీఆర్ఎస్ గొర్రెలు, బర్రెలు ఇస్తే.. మేం ఉద్యోగాలిచ్చాం.. సీఎం రేవంత్
లోకేష్‌పై పొగడ్తల వర్షం
అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు తాను పాటించిన నియమాన్ని నేడు లోకేష్ పాటిస్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తకైనా, సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ తన వారసత్వానికి లోకేష్ వన్నె తెస్తున్నాడని ప్రశంసించారు. గగనసీమ నుంచి ఇది చూసి అయ్యారే.. భళా.. భళా మనవడా అని తన మనసు మురిసిపోతోందని ఏఐ వీడియోలో అన్నారు. ఈ దేశం మనదని.. దేశ సమైక్యత, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడినని చెప్పారు. ఈనాడు వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కదా తాను కోరుకుందని అనిపిస్తోందని పేర్కొన్నాడు.