Rangareddy district: అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అటవీ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ, పంచాయతీ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వన మహోత్సవంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిఆర్డిఏ 41,72,710 మొక్కలను, విద్యాశాఖ 89,428 మొక్కలను, అటవీ శాఖ 9,53,757 మొక్కలను జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో విరివిగా మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. నేషనల్ హైవే, రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్ రోడ్లకు ఇరువైపుల ఎక్కువగా మొక్కలు నాటలని కలెక్టర్ సూచించారు.
ప్రతి శాఖ తమ పరిధిలో 3 రోజుల్లో మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు ఎక్కువగా నాటాలన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు ఈత వనాలను సొసైటీల ద్వారా పంపిణీ చేసి సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా ఒక రోజు పెద్ద మొత్తంలో మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రముఖ రోజులలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి సరిపడే స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు.
Also Read: Mega Job Mela: మెగా జాబ్ మేళా.. 11,000 ఉద్యోగాల అవకాశాలు!
వర్షాకాలం మొదలైనందున మొక్కలు పెద్ద ఎత్తున నాటాలని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే మొక్కలను అలాగే ఔషధ మొక్కలను నాటేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మొక్కలు నాటిన రోజు నుంచి చెట్లకి నీళ్లు పొసేందుకు పాదులు చేయాలని, ఎరువువేయడంతో పాటు ప్రతిరోజు నీళ్లు పెట్టాలన్నారు. మొక్కలకి చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, పిడి డిఆర్డీఎ శ్రీలత, డీపీఓ సురేష్ మోహన్, మున్సిపల్ కమిషనర్లు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Also Read: Telangana Formation Day: యువతకు గుడ్ న్యూస్.. రూ.8,000 కోట్లతో ఉపాధి.. డిప్యూటీ సీఎం వెల్లడి!