YS Jagan Warning: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని అన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటి అనంతరం జగన్ మాట్లాడారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదన్న జగన్.. తెగువ, ధైర్యం ఉంటేనే పాలిటిక్స్ చేయగలమని అన్నారు. కేసులకు, జైళ్లకు భయపడకూడదని అన్నారు. వ్యవస్థలను సీఎం చంద్రబాబు నాశనం చేస్తున్నారని.. హామీల పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మంగళవారం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం లేని చోట కూడా టీడీపీ పోటీ పెట్టి అధికారాన్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం లేకపోయినా నర్సారావుపేట, కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారని మండిపడ్డారు. కుప్పం మొదలుకుని ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే ఉందని అన్నారు.
రాష్ట్రంలో భయానక పరిస్థితులు
చంద్రబాబు ప్రభుత్వంపై నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. మనకన్నా ఎక్కువ చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు దృష్టిలో మాట ఇవ్వడమంటే వెన్నుపోటు పొడవడమేనని మరోమారు నిరూపించారని అన్నారు. ఎవరూ ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులను చంద్రబాబు తీసుకువచ్చారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం.. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నారని అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్కొక్కరి సినిమా చూపిస్తా
వైసీపీ పార్టీలో చురుగ్గా ఉన్న వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్త కష్టాన్నీ చూస్తున్నానని.. జగన్ 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ‘ఇప్పుడు అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి. కొడతానంటే.. కొట్టమనండి. కానీ మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి. ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తాం. రిటైర్డ్ అయిన వారినీ లాక్కుని వస్తాం. దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే రప్పిస్తాం. అన్యాయాలు చేసిన ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాం. మనకూ టైం వస్తుంది. చంద్రబాబు నాటిని విత్తనాలు.. కచ్చితంగా ఈ పరిస్థితులకు దారితీస్తాయి’ అని జగన్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Hyderabad Metro Offers: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన మెట్రో ఛార్జీలు.. ఎంతంటే?
బెయిల్ వస్తే.. మరో కేసు
చంద్రబాబు పాలన వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డవారి కథలు వింటే చాలా ఆవేదన కలుగుతోందని వైఎస్ జగన్ అన్నారు. మహిళలను అని చూడకుండా నెలల తరబడి జైళ్లలో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక కేసులో బెయిల్ వస్తే.. వెంటనే మరో కేసు పెడుతున్నారని మండిపడ్డారు. వల్లభనేని వంశీ విషయంలో ఇలాగే చేశారని.. దళితుడైన ఎంపీ నందిగం సురేష్ విషయంలోనూ ఇదే జరిగిందని అన్నారు. సుమారు నెలన్నరకు పైగా జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత నందిగాం సురేష్ ను మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపారని జగన్ గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రజల తరఫున గట్టిగా పోరాటాలు చేద్దామని.. వచ్చేది మన ప్రభుత్వమేనని స్థానిక సంస్థల నేతల్లో స్థైర్యాన్ని నింపారు. మంచి రోజులు కచ్చితంగా వస్తాయని జగన్ భరోసా కల్పించారు.