Medchal murder Case: కలకలం సృషించిన మహిళా హత్య కేసును మేడ్చల్ పోలీసులు 72 గంటల్లోనే చేధించారు. ఈ నెల 16న మేడ్చల్ మున్సిపల్ అత్వెల్లి గ్రామంలో మహిళను గొంతు, చెవి, ముక్కు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ ఘటనపై డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసు బృందాలు నిందితుడి పట్టుకున్నారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్యా ఘటనకు సంబంధించిన వివరాలను డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో ఘోర విషాదం.. అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి..
గత 6 నెలల నుంచి అత్వెల్లిలో దాసరి లక్ష్మి(50) నివాసం ఉంటోంది. ఈమెకు దిల్ సుఖ్ నగర్ కు చెందిన ఓ మహిళతో పరిచయం ఉంది. సదరు మహిళ కొడుకు పని పాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. అతడికి ఏదైనా పని చూయించాలని అడగగా.. ఇందుకు లక్ష్మీ సరే అని చెప్పింది. హత్య జరగడానికి ఒక రోజు ముందు లక్ష్మి, రాకేశ్(24), అతడి తల్లి ముగ్గురు కలిసి కల్లు సేవించారు. ఆ తర్వాత రాకేశ్ తల్లి వెళ్లిపోగా.. రాకేశ్‌ను లక్ష్మి తన నివాస గృహానికి తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చింది.
మత్తులో ఉన్న అతడికి లక్ష్మి ఒంటిపైన ఉన్న నగలపై ఆశపుట్టి దోచుకోవడానికి ప్రయత్నించాడు. లక్ష్మీ ప్రతిఘటించడంతో కూరగాయలు కోసే కత్తితో చెవి, ముక్క, గొంతు కోసి, నగలు లాక్కోవడంతో పాటు మట్టుబెట్టాడు. ఆధారాలను నాశనం చేసేందుకు ఆమె ఒంటిపై బట్టలు వేసి.. నిప్పంటించి.. తాళం వేసి వెళ్లిపోయాడు. దర్యాప్తునకు కేటాయించిన ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి సుమారు రూ.53 వేల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించిన పోలీసులను డీసీపీ కోటిరెడ్డి అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏసిపి శంకర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ, డిఐ సుధీర్ కృష్ణ,ఎస్ ఐ లు మన్మధరావు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Crime News: కారం చల్లి.. కత్తులతో అల్లుడు పై దాడి చేసిన అత్త, మామ