Medchal Murder: మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అత్వెల్లిలో చోటుచేసుకుంది. కిరాతకంగా చెవు, గొంతు, ముక్కు కోసి కాల్చి వేశారు. స్థానికుల కథనం ప్రకారం వికారాబాద్ కు చెందిన లక్ష్మి (50) అత్వెల్లిలో రేకుల గదిలో అద్దెకు ఉంటూ కిష్టాపూర్‌లోని ఓ మద్యం దుకాణంలో రోజు వారీ కూలీగా పని చేస్తోంది. తెల్ల వారుజామున రేకుల రూంలో నుంచి పొగలు రావడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ హుటాహుటీనా చేరుకుని, విచారణ జరిపారు.
సగం కాలిన స్థితిలో మృతదేహం లభించింది. గొంతు, చెవులు, ముక్కు కోసి చంపి, ఆ తర్వాత ఒంటిపై బట్టలు వేసి, కాల్చివేసినట్టు గుర్తించారు. క్లూస్ టీం సహాయంతో పోలీసులు ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం డీసీపీ కోటి రెడ్డి మాట్లాడుతూ మహిళ హత్య కేసు ఛేదించడానికి లోకల్, ఎస్వోటీ పోలీసులతో కలిపి ఐదు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మృతురాలు మూడు నెలలుగా అత్వెల్లిలో ఒంటరిగా నివాసం ఉంటుందన్నారు.
Also Read: Medipally Tragedy: కన్న బిడ్డలతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి..!
ఆమె ఒంటి మీదున్న నగలు, డబ్బుల కోసం నమ్మించి ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడా?, గతంలో ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి ఈ పని చేశాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. త్వరలో నిందితులను పట్టుకొని, శిక్ష పడేలా చేస్తామన్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా ఈ ఘటనలో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.