Janasena: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి వచ్చే జూన్ 12 నాటికి సరిగ్గా ఏడాది. టీడీపీ, జనసేన, బీజేపీ (TDP, Janasena, BJP) పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లి.. 151 సీట్లున్న వైసీపీని (YSRCP) చిత్తుచిత్తుగా ఓడించి 11 సీట్లకు పరిమితం చేశాయి. వై నాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన వైసీపీని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన పరిస్థితి. అయితే ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచీ.. ఇప్పటి వరకూ కూటమిలోని ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా కమలం పార్టీ క్రమక్రమంగా రాష్ట్రంలో వికసిస్తూ.. విస్తరిస్తున్నదా? లేదంటే వాడిపోతున్నదా? జనసేన పరిస్థితేంటి? మునుపటికీ, ఇప్పటికీ ఏమైనా మార్పులు వచ్చాయా? లేదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రానున్న ఎన్నికల్లో కార్యాచరణ ఏంటి? ఇలాగే మంత్రి పదవికే పరిమితం అవుతారా? ఇవన్నీ కాదు అసలు జనసేన క్యాడర్ సంతృప్తిగా ఉందా? మంత్రి పదవులు మొదలుకొని నామినేటెడ్ పదవుల వరకూ క్యాడర్ హ్యాపీగా ఉందా? లేదా? క్యాడర్ కోరుకుంటున్నది ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం..
Read Also-YS Jagan: ప్చ్.. సొంత జిల్లాలో పరువు పోగొట్టుకున్న వైఎస్ జగన్!
‘కమలం’ కథేంటి?
2024 ఎన్నికల ముందు వరకూ ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి ఏంటన్నది తెలుగు ప్రజలందరికీ తెలుసు. అయితే కూటమిగా ఏర్పడిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి నేటి వరకూ పార్టీ రేంజ్ మారిపోయింది. రాష్ట్రంలో బీజేపీ మూడో స్థానానికి ఎగబాగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం.. గ్రామ స్థాయిలో కార్యకర్తలకు సంబంధించి పదవులు ఇస్తున్నది. దీంతోపాటు ప్రతినెలా సమావేశాలు నిర్వహించడం, పార్టీ.. ప్రభుత్వం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా బీజేపీలోకి ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులు చేరడానికి ఇది ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి గతంలో మండలాలకే పరిమితమైన కమలం పార్టీ.. ఇప్పుడు ఏకంగా గ్రామాల్లోకి శరవేగంగా చొచ్చుకొని పోతోందంటే అర్థం చేసుకోవచ్చు.
Read Also- Monsoon 2025: దేశ ప్రజలకు చల్లటి శుభవార్త.. ముందుగానే రుతుపవనాల పలకరింపు
అయ్యో.. జనసేనా?
జనసేన విషయానికొస్తే.. పార్టీ ఆవిర్భావం నుంచి 2024 ఎన్నికల ముందు వరకూ ఒకెత్తు.. ఫలితాల తర్వాత ఒకెత్తు అని చెప్పుకోవాలి. పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంతలా అంటే అధినేత రెండు చోట్ల పోటీచేసినా ఘోర పరాజయం పాలైన పరిస్థితి నుంచి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గెలవడంతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారంటే ఎంత వేగంగా పార్టీ బలోపేతం అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గెలిచాక క్యాడర్‌కు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తూ.. బూత్ లెవల్, గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలంగా తయారు చేయాల్సిన పవన్ కళ్యాణ్ ఎందుకో ఈ విషయంలో బీజేపీ కంటే దారుణంగా వెనుకబడిపోయారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఉన్నప్పటికీ ఎలాంటి గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గస్థాయి కమిటీలు ఏర్పాటు చేయకుండా.. ఇప్పటికి కూడా ఇంకా పార్టీ కోసం పని చేయాలంటూ మాట్లాడుతున్న పరిస్థితి. దీంతో ఎంతోమంది పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నప్పటికీ బయటికి చెప్పుకోలేక సతమతం అవుతున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నేతలు ఏకంగా.. నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకుల ప్రొఫైల్ పెట్టుకుని మరీ పసుపు కండువా, జెండా కప్పుకున్నారా? అనే విధంగా పనిచేస్తున్నారు.

జనసేన కార్యక్రమాల కంటే టీడీపీ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారని పెద్ద ఎత్తునే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదని జనం మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఎంతోమంది నేతలు జనసేన కోసం కష్టపడి పనిచేస్తూ, తమ సొంత నగదుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అయితే గెలిచిన తర్వాత నియోజకస్థాయిలో ఎలాంటి పదవులు అనుభవించకుండా మౌనం వహిస్తూ ఏం చేయాలో, ఎవరిని అడగాలో కూడా అర్థం కాక మిన్నకుండిపోతున్నారు. ఆఖరికి సొంత పనులు కూడా చేసుకోలేక స్థానిక ఎమ్మెల్యేను అడగలేక ఎంతో మంది ఆవేదన చెందుతున్నారు. కనీసం పార్టీ కార్యక్రమాలు కూడా తమను పిలవట్లేదని అసహనంతో రగిలిపోతున్నారు. నియోజకవర్గం, మండలాల్లో అయినా పదవులు దక్కుతాయో? లేదో? అని అనుచరులు, కార్యకర్తలకు చెప్పుకొని బాధపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా జనసేన నాయకులను దగ్గరికి కూడా రానివ్వడం లేదనే మాటలు వినిపిస్తున్నా.. అధిష్టానం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు.
Read Also- YS Jagan: వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్ర.. అవసరమేనా?
పొత్తు ధర్మం ఏదీ?
జనసేన, టీడీపీ పొత్తు కుదిరే సమయంలో కళ్యాణ్ ఏం చెప్పారు..? ‘ మనం 25 సీట్లు మాత్రమే తీసుకుంటున్నాం కానీ, నామినేటెడ్ పదవులు మాత్రం జనసేనకు సింహ భాగం తీసుకుంటాం’ అని అన్నారు. అంటే 1/3rd కంటే ఎక్కువ అని చంద్రబాబు (Chandrababu) కూడా ఒప్పుకున్నారు. కానీ కూటమి గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. టీడీపి అసలు కూటమిలోనే లేనట్లుగా.. అన్ని వాళ్ళే తీసేసుకుని జనసేనకు ప్రతిసారీ మొండి చేయి చూపిస్తున్నారు. పవన్ ఎంతసేపూ.. రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు కోసమే చూస్తున్నారు కానీ, టీడీపీ మాత్రం తన స్వార్ధ ప్రయోజనాలే చూసుకుంటున్నదనే అసంతృప్తితో జనసైనికులు రగిలిపోతున్న పరిస్థితి. అసలు పొత్తు ధర్మం ఎక్కడుంది? వందకు వంద శాతం ఎక్కడా ఈ ధర్మాన్ని టీడీపీ పాటించడం లేదని జనసైన్యం కన్నెర్రజేస్తున్నది. ‘పిల్లి కుండలో తలపెట్టి పాలు తాగుతూ నన్నెవరూ గమనించడం లేదు అనుకుంటుంది కదా..?’ ఇప్పుడు టీడీపీ తీరును కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని నేతలు చెబుతున్నారు. అందుకే టైమ్ వచ్చినప్పుడు, సరైన గుణపాఠం చెబుతారని.. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా సమయం కోసం వేచి చూస్తున్నారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ కోసం, రాష్ట్ర ప్రజలకోసం కళ్యాణ్.. జనసేన మాత్రమే త్యాగం చేసిందని.. ఇది జగమెరిగిన సత్యమని బల్లగుద్ధి మరీ జనసైనికులు చెబుతున్నారు.
Read Also- Samantha: వామ్మో.. వైఎస్ షర్మిలను ఇమిటేట్ చేసిన సమంత.. పెద్ద రచ్చే జరుగుతోందిగా!
మంత్రి పదవే సరిపోతుందా?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి పదవికే అంకితం అయ్యారనే విమర్శలు, అంతకుమించి ఆరోపణలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. ముఖ్యంగా క్యాడర్‌కు పదవులు ఇప్పించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ పెద్ద ఎత్తునే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నప్పటికీ.. గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాలలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయపోవడమేంటి? పార్టీని బలోపేతం చేయకుండా.. అధినాయకుడే ఏకంగా మరో 15 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారంటూ మాట్లాడుతుంటే జనసేన నాయకుల్లో, కార్యకర్తలు అసహనంతో రగిలిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీని కార్యకర్త నమ్ముకొని ఉన్నప్పుడు.. నాయకుడు ‘మీకు నేను అండగా ఉంటాను.. నేను సీఎం అభ్యర్థిగా ఉంటాను’ అని చెప్పాల్సింది పోయి పక్క పార్టీకి ఇంకో 15 ఏళ్లు పని చేయాలని చెబుతుంటే ఎవరికైనా అసహనం వస్తుందా? రాదా? అంటూ ద్వితియ శ్రేణి నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన ధోరణి మార్చుకోవాలని గ్రామస్థాయి నుంచి సమావేశాలు నిర్వహించి 175 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలబెట్టుకునే విధంగా పనిచేయాలని.. రాబోయే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నిలబడాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండాలని క్యాడర్ కోరుకుంటోంది. మరీ ముఖ్యంగా పార్టీని బలంగా నిలబెట్టి.. ఏళ్ల తరబడి పక్క పార్టీల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా సొంత పార్టీ సంగతి చూడాలని జనసేన నేతలు కోరుకుంటున్నారు.
అవును.. సీఎం కావాల్సిందే..!
ఒకవేళ పొత్తు ఉంటే కచ్చితంగా రెండున్నర ఏళ్ళు సీఎం పదవి కావాలని గట్టిగా డిమాండ్ చేయాలని పవన్ కళ్యాణ్‌కు నేతలు సూచిస్తున్నారు. తమకు కూడా పదవులు రావాలని, ప్రజల సమస్యలు తీర్చాలని ఉండదా? అంటూ జనసేన నాయకులు కుమిలిపోతున్నారు. ఓవైపు బీజేపీ చాప కింద నీరులాగా ప్రవహిస్తూ పోతుంటే.. మరోవైపు జనసేన మాత్రం నీరుగారి పోతోందని జనాలు సైతం మాట్లాడుకుంటున్నారు. అందుకే పార్టీ అనేది గ్రామస్థాయి నుంచి ఉంటేనే ఎప్పటికైనా విజయం సాధిస్తామని క్యాడర్ తేల్చి చెబుతున్నది. పార్టీని నేతలు వీడుతున్నప్పటికీ ఈ విషయంపై అధిష్టానం సీరియస్‌గా తీసుకోకపోవడంతో రేపు రాబోయే రోజుల్లో ఎంతమంది జనసేన కోసం పనిచేస్తారంటూ పెద్ద ఎత్తునే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధిష్టానం గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని.. రేపు రాబోయే రోజుల్లో సీఎం పదవికి పోటీ చేసే విధంగా పనిచేయాలని.. 175 నియోజకవర్గాల్లో అంతా సెట్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్‌ను జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. పార్టీ, క్యాడర్‌లో ఇంత అసంతృప్తి, ఆగ్రహావేశాలు ఉన్నప్పుడు ఇకనైనా పవన్ కళ్యాణ్ ఆలోచించి.. మంత్రి పదవి దగ్గరే ఆగిపోకుండా సీఎం పదవి అధిరోహించడానికి ఏ మాత్రం ప్లానింగ్ చేస్తారో వేచి చూడాలి మరి.
Read Also- Jr NTR: టీడీపీ ‘మహానాడు’కు ఎన్టీఆర్.. సీబీఎన్ స్ట్రాటజీ మామూలుగా లేదే!