Chicken: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. మహిళా ఎమ్మెల్యే అనుచరులు సరిగ్గా ఇదే ఆచరించేస్తున్నారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తుందో? లేదో? వచ్చినా అభిమాన నేత ఎమ్మెల్యేగా గెలుస్తారో? లేదో? అని అనుకున్నారేమో కానీ విచ్చలవిడిగా దందాలకు తెరలేపారు. ఓ వైపు అనుచరులు, మరోవైపు మహిళలు సైతం రంగంలోకి దింపి ఎక్కడికక్కడ చికెన్ షాపులకు హుకూం జారీచేశారు. ఇదంతా మరెక్కడో కాదండోయ్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోనే. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ (Bhuma Akhila Priya) అనుచరులు నియోజకవర్గంలో విర్రవీగిపోతున్నారు. ఇప్పటికే కేజీ చికెన్ పైన రూ.10 వాటా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే భర్త భార్గవ్ రామ్ హుకుం జారీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయితే ఈ వివాదం సద్దుమణగకముందే ఎమ్మెల్యే మహిళా అనుచరులు రంగంలోకి దిగిపోయారు.
Read Also- Tirumala: టీటీడీకి ఎన్నారై భారీ విరాళం.. తిరుమలలో భారీ భద్రత
మేమేం తక్కువ కాదు!
దందాలో పురుషులకు తామేమీ తక్కువ కాదనుకున్నారో ఏమో కానీ అఖిల ప్రియ మహిళా అనుచరులు రంగంలోకి దిగిపోయారు. ఇదివరకు రూ.10 వసూలు చేశారు కదా.. ఇప్పట్నుంచీ కేజీ చికెన్ మీద రూ.20 కమిషన్‌గా ఇవ్వాల్సిందేనని చికెన్ షాపుల యజమానులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. వింటే సరే లేకపోతే అంతే సంగతులు అంటూ వార్నింగ్ సైతం ఇస్తున్నారంటే ఆళ్లగడ్డలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. చికెన్ కోళ్లను కూడా తాము చెప్పిన చోటే కొనుగోలు చేయాలని.. లేని పక్షంలో చికెన్ సెంటర్లు (Chicken Centres) లేకుండా చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని యజమానులు లబోదిబో అంటున్నారు. ఈ తతంగం నియోజకవర్గంలోని చాగలమర్రిలో జరుగుతోంది. తాము చిరు వ్యాపారులం మహాప్రభో.. కమిషన్లు ఇచ్చుకోలేమని, కుటుంబ పోషణ భారమవుతుందటూ చికెన్ షాపు వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ధౌర్యం చేసిన కొందరు వ్యాపారస్థులు జిల్లా ఎస్పీని కలిసి ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల బెదిరింపులు, దౌర్జన్యాలపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీని వ్యాపారస్థులు కోరారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వారికి ఎస్పీ హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో చంద్రబాబు (CM Chandrababu) ఆర్ధిక విధ్వంసం సృష్టిస్తుంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ఇంకో రెండు అడుగులు ముందుకేసి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఎమ్మెల్యే అఖిలప్రియపై ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు, అంతకుమించి సంచలన వ్యాఖ్యలు చేయగా నానా హడావుడే జరిగింది. అప్పుడే కేజీ చికెన్‌పై రూ.10 కమీషన్ అంటూ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా మహిళా అనుచరులు సైతం రూ.20 కమీషన్‌గా ఇవ్వాలని బెదిరిస్తున్నారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నేతల ఒత్తిడికి తలొగ్గకుండా ఈ దందాలకు పాల్పడే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.
Read Also-Kondapalli Srinivas: లోకేష్‌కు సామాన్యుడి ఫిర్యాదు.. చింతిస్తూ క్షమాపణ చెప్పిన మంత్రి కొండపల్లి