Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీవారిని దర్శించుకొని పెద్ద ఎత్తునే విరాళాలు, హుండీలో నగదు వేస్తుంటారు. అలా అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల గురువారం భారీ విరాళం ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళాలకు సంబంధించిన డీడీలను దాత అందజేశారు. ఇందులో ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1,00,01,116 .. ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ. 10,01,116, .. ఎస్వీ విద్యా దాన ట్రస్ట్‌కు రూ.10,01,116, .. ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ. 10,01,116, .. ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌కు రూ.10,01,116 విరాళంగా అందజేశారు. విరాళాలు అందించిన దాతను ఛైర్మన్ నాయుడు అభినందించారు.
భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో గురువారం తిరుమల భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలీసు శాఖ, టీటీడీ, ఇతర భద్రతా విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతపురం రేంజ్ డీఐజీ డా.షెమూషి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో భద్రతను మరింత బలోపేతం చేయడమే భద్రతా ఆడిట్ ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. అన్ని భద్రతా దళాలు, టీటీడీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ, భక్తుల మనోభావాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. అంతకు ముందు టీటీడీ ఇన్‌ఛార్జి సీవీఎస్వో, తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు 2023 మే నెలలో నిర్వహించిన భద్రతా ఆడిట్ సమీక్షలో చేసిన ప్రతిపాదనలు, అలాగే ఇటీవల ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా చేపట్టాల్సిన మార్పులు అనే విషయాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సుదీర్ఘంగా వివరించారు.
14 ఎంట్రెన్స్‌లలో పటిష్టంగా..
అలాగే, ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోం గార్డులు, సివిల్ పోలీసు, టీటీడీ భద్రతా సిబ్బంది వంటి అన్ని భద్రతా దళాలను సమన్వయ పరచి ప్రతి ఒక్క దళానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సహా అన్ని యాక్సెస్ కంట్రోల్ బృందాలకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని అన్నారు. తలకోన, మామండూరు, తుంబురు తీర్థం, మంగళం మార్గాలు సహా శేషాచల అటవీ ప్రాంతానికి చెందిన 14 ప్రవేశ ద్వారాలలో భద్రతను మరింత పటిష్టం చేయాలని సూచించారు. అలాగే, భద్రతా సిబ్బందికి రసాయన, జీవ, కిరణ, అణు ముప్పులపై శిక్షణ(CBRN), యాంటీ సాబటేజ్ చర్యలు, మాక్ డ్రిల్లులు, ఎవాక్యుయేషన్ డ్రిల్లులు వంటి అంశాలపై శిక్షణలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో గ్రేహౌండ్స్ (కమాండర్) ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ అరిఫ్ హఫీజ్, తిరుపతి డీఎఫ్ఓ వివేక్ ఆనంద్, వివిధ భద్రతా దళ అధికారులు, టీటీడీ విజిలెన్స్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also- Jr NTR: టీడీపీ ‘మహానాడు’కు ఎన్టీఆర్.. సీబీఎన్ స్ట్రాటజీ మామూలుగా లేదే!