Boycott Turkey: భారత్ – పాక్ యుద్ధ ఉద్రిక్తతల సమయంలో టర్కీ దేశం తన వక్రబుద్ధిని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న పాక్ కు వత్తాసు పలుకుతూ యుద్ధంలో అండగా నిలిచింది. భారత్ పైకి పాక్ ప్రయోగించిన డ్రోన్లు చాలా వరకూ టర్కీ పంపినవేనని భారత సైన్యం సైతం మీడియా సమావేశంలో ప్రకటించింది. దీంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే యాపిల్స్ పై భారత వ్యాపారులు నిషేధం విధించారు. ఈ క్రమంలోనే తాజాగా టర్కీకి చెందిన పాలరాయిని సైతం బ్యాన్ విధించారు.
టర్కీ నుంచి భారత్ కు దిగుమతయ్యే పాలరాయిలో ఎక్కువ భాగం రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ కే చేరుతుంటుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ దాడికి యత్నించిన సరిహద్దు రాష్ట్రాల్లో రాజస్థాన్ కూడా ఉంది. అయితే తమతో పాటు దేశంపై దాడికి యత్నించిన పాక్ కు టర్కీ సాయం చేయడంపై ఉదయ్ పుర్ కు చెందిన పాలరాయి వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టర్కీ నుంచి పాలరాయి దిగుమతులను నిషేధిస్తున్నట్లు ఉదయ్ పుర్ మార్బుల్ ప్రాసెసర్ల కమిటీ (Marble Processors Committee) ప్రకటించింది.
టర్కీ నుంచి పాలరాతితో పై గ్రానేట్ దిగుమతిని సైతం నిలిపివేస్తున్నట్లు మార్బుల్ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం మార్బుల్ వ్యాపారులు లేఖ రాశారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రధానికి తెలియజేశారు. టర్కిష్ పాలరాయి దిగుమతులపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని లేఖలో కోరారు. తద్వారా పాక్ కు అండగా నిలిచిన టర్కీ దేశానికి గట్టి గుణపాఠం చెప్పాలని సూచించారు. అయితే దీనిపై కేంద్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
VIDEO | Amid ongoing tensions between India and Pakistan, marble traders in Udaipur are boycotting imports of the stone from Turkey, citing its support for Pakistan.
Many of the drones used by Pakistan to attack India during the four days of hostilities last week were of Turkish… pic.twitter.com/ip6KZxrgZZ
— Press Trust of India (@PTI_News) May 14, 2025
టర్కీ పాలరాయిపై నిషేధం విధించడంపై ఉదయ్ పూర్ మార్బుల్ ప్రొసెసర్ కమిటి అధ్యక్షుడిగా ఉన్న కపిల్ సురానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలరాయి ఎగుమతిలో ఆసియాలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రంగా ఉదయ్ పూర్ ఉందని అన్నారు. అయితే ఇక్కడికి వచ్చే పాలరాయితో 70 శాతం టర్కీ నుంచే వస్తున్నట్లు పేర్కొన్నారు. ఏటా 14 నుంచి 18 టన్నుల మార్బుల్ ను టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ట్రెడ్ విలువ రూ.2,500 – 3,000 కోట్ల వరకూ ఉంటుందని చెప్పారు.
మరోవైపు మహారాష్ట్ర పుణె మార్కెట్ కమిటీ.. టర్కీ నుంచి దిగుమతయ్యే ఆపిల్స్ పై నిషేధం విధించింది. దీంతో పుణేలోని మార్కెట్ యార్డుల్లో టర్కిష్ యాపిల్స్ కనుమరుగు అయ్యాయి. దీని వల్ల ఆ దేశానికి రూ.1200 నుంచి రూ.1500 కోట్ల వరకూ నష్టం వాటిల్లనున్నట్లు పుణె వ్యాపారులు తెలియజేస్తున్నారు. మనతో వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించుకొని మనపైనే కత్తి దువ్వే వారికి ఇలాగే గుణపాఠం చెప్పాలని పూణేలోని ఆపిల్ వ్యాపారులు అంటున్నారు.