Kashish Chaudhary: పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ నిత్యం అశాంతితో రగిలి పోతుంటుంది. అక్కడి బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA).. స్వాతంత్రాన్ని కాంక్షిస్తూ పాక్ సైనికులపై దాడులకు తెగబడుతూ ఉంటుంది. భారత్ – పాక్ యుద్ధం సందర్భంగా కూడా బలూచ్ మిలిటెంట్లు దయాది దేశం సైనికులపై కాల్పులకు తెగబడ్డారు. అలా నిత్యం అలజడులతో కొట్టుమిట్టాడే బలూచిస్థాన్ ప్రావిన్స్ లో ఒక హిందూ యువతి చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది.
పరీక్షల్లో ఉత్తీర్ణత
పాకిస్థాన్ హిందూ మైనారిటీ కమ్యూనిటికి చెందిన 25 ఏళ్ల కాశిష్ చౌదరి (Kashish Chaudhary).. బలూచిస్థాన్ ప్రావిన్స్ (Balochistan Province) అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టింది. బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా ఆమె ఈ పోస్ట్ కు ఎంపికైంది. దీంతో బలూచిస్థాన్ సీఎం స్వయంగా ఆమెకు నియామక పత్రాలు అందజేశారు. అయితే కాశిష్ పాక్ కు చెందిన యువతే అయినప్పటికీ హిందువు కావడంతో ఒక్కసారిగా ఆమె పేరు భారత్ దేశంలో మార్మోగుతోంది.
మధ్యతరగతి కుటుంబం
కాశిష్ చౌదరి విషయానికి వస్తే.. ఆమె బలూచిస్థాన్ ప్రావిన్స్ చాగై జిల్లాలోని నోష్కి పట్టణానికి చెందినది. ఆమె తండ్రి ఒక చిరు వ్యాపారి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తాను.. మూడేళ్ల పాటు ఎంతో కష్టపడి చదివినట్లు పాక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాశిష్ చెప్పింది. రోజుకు కనీసం 8 గంటలు చదివినట్లు పేర్కొంది. క్రమశిక్షణ, కృషితో పాటు సమాజానికి ఏదో చేయాలన్న తాపత్రయం తనను ముందుకు నడిపించాయని ఆమె పేర్కొంది.
وزیر اعلیٰ بلوچستان سے کم عمر اقلیتی افسر اسسٹنٹ کمشنر کشش چوہدری کی ملاقات، کشش چوہدری نے اپنی محنت، لگن اور استقامت سے نہ صرف اپنی صلاحیتوں کا لوہا منوایا بلکہ اقلیتی برادری کے دیگر نوجوانوں کے لیے بھی مشعلِ راہ بن گئی ہیں، میر سرفراز بگٹی@PakSarfrazbugti pic.twitter.com/JaQaomXzhT
— Chief Minister's Office Balochistan (@CMOBalochistan) May 12, 2025
తండ్రి.. చాలా హ్యాపీ
తన కూతురి అసిస్టెంట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడంపై కాశిష్ చౌదరి తండ్రి గిర్ధారీ లాల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురి కృషి, నిబద్ధత వల్లే అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికైనట్లు చెప్పారు. ఇది తనకెంతో గర్వకారణంగా ఉందని గిర్ధారీ లాల్ అన్నారు. బాగా చదువుకొని.. మహిళలు, సమాజానికి ఏదైనా చేయాలని కాశిష్ చిన్నప్పటి నుంచి పరితపించేదని పేర్కొన్నారు.
గతంలోనూ చాలా మంది
పాక్ లో మైనారిటీలైన హిందువులపై దశాబ్దాల కాలంగా దాడులు జరుగుతున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. ముఖ్యంగా ఆడవారిపై మరిన్ని ఆంక్షలు విధిస్తుంటారు. అటువంటి వాటిని తట్టుకొని కాశిష్ చౌదరి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి చేరుకోవడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కాశిష్ చౌదరి తరహాలోనే గతంలో పలువురు హిందూ మహిళలు పాక్ లో ఉన్నత ఉద్యోగాలను సాధించారు. 2022లో మానేష్ రోపేటా కరాచీలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తొలి హిందూ మహిళగా నిలిచింది. అలాగే 2019లో పుష్ప కుమారి కోహ్లీ.. కరాచీలో సబ్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది. అదే సమయంలో సింధ్ లోని షాదాద్ కోట్ లో సుమన్ పవన్ బొదాని జడ్జిగా ఎంపికైంది.