Shamirpet Land: నిబంధనల ప్రకారం లే ఔట్‌లు చేయడం, ప్లాట్లను అమ్మడం, తర్వాత సామాజిక ప్రయోజనాల కోసం వదిలిన స్థలాన్ని కబ్జా చేయడం పరిపాటిగా మారుతోంది. ఏ వెంఛర్ చూసిన.. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. తాజాగా శామీర్‌పేట మండలం మురహరిపల్లిలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా అయితే వెంచర్లలో కేటాయించిన పార్కు స్థలాన్ని అక్రమంగా భవన నిర్మాణాన్ని చేపట్టి, ఆస్థి పన్ను కడుతూ తమది అనిపించుకుంటారు. కానీ ఇక్కడ ఏకంగా ఔరా అనిపించేలా రిజిస్ర్టేషన్ కూడా జరిగిపోయింది.
ఈ అక్రమ తంతు వివరాల్లోకి వెళితే… శామీర్‌పేట మండలం మురహరిపల్లిలోని సర్వే నెంబరు 47పీ, 48పీలలో చాలా ఏండ్ల కింద గృహ సంకల్ప్ రియల్టర్స్ సంస్థ 12.44 ఎకరాల్లో వెంచర్ చేసింది.
Also read: Bangladesh Ex President: ఇదేందయ్యా ఇది.. లుంగీతో పారిపోయిన లీడర్.. విచారణకు ఆదేశం
అందులో 10 శాతం భూమిని రోడ్లు, పార్కు స్థలానికి కేటాయించారు. రోడ్లకు పోను పార్కుకు 583 గజాలను కేటాయించారు. వెంచర్‌లోని 135 ప్లాట్లను అమ్మేశారు. ఆ తర్వాత ఖాళీగా ఉన్న పార్కు స్థలం కబ్జాదారుల కన్ను పడింది.
పాత లేఔట్ మార్చి, పార్కు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేశారు. కబ్జా చేసిన స్థలంలో ప్లాట్లు ఉన్నట్టు నమ్మించి, హద్దులు పాతారు. 583 గజాల స్థలంలో 235 స్థలాన్ని కబ్జా చేసి, అమ్మేశారు. ఏకంగా కబ్జా చేసిన వ్యక్తి మరో వ్యక్తికి రిజిస్ర్టేషన్ కూడా చేయించాడు.
కుమ్మక్కైన పంచాయతీ కార్యదర్శి
పార్కు స్థలం కబ్జా విషయం వెలుగులోకి రావడంతో మురహరిపల్లి పంచాయతీ కార్యదర్శికి పలువురు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికీ కబ్జాదారుడితో కుమ్మక్కైన పంచాయతీ కార్యదర్శి నోటీసులు రిజిస్ర్టేషన్ చేసుకున్న వ్యక్తికి జారీ చేయాల్సి ఉండగా కబ్జా చేశారంటూ మరో వ్యక్తికి నోటీసు జారీ చేశారు.
కబ్జా ప్రాంతంలో నిర్మాణాలు కూల్చివేసినప్పటికీ రిజిస్ట్రేషన్ రద్దు చేయలేదు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరితే కబ్జా చేసిన వ్యక్తికి నోటీసు జారీ చేశామని, రిజిస్ర్టేషన్ గురించి మాట్లాడితే మాత్రం కిమ్మనడం లేదు. కాగా అక్రమంగా కబ్జా చేసిన పార్కు స్థలాన్ని వెంటనే ఆధీనంలోకి తీసుకోవాలని, గ్రీనరీ పెంచి, ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.