Pakistan War Statement: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా తమకు ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్థాన్ బుకాయిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడిలో 3 ముగ్గురు పౌరులు మాత్రమే చనిపోయారని.. పలువురు గాయపడ్డారని ప్రకటించింది. ఆ తర్వాత ఉద్రిక్తతలు తారా స్థాయికి వెళ్లడం.. పాక్ నుంచి భారత్ పైకి వచ్చిన యుద్ధ విమానాలను భారత్ నేలకూల్చడం ఆపై దయాది దేశం వైమానిక స్థావరాలపై దాడి చేయడం చకా చకా జరిగిపోయాయి. అయితే భారత్ తో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిన నేపథ్యంలో పాక్ కొద్ది కొద్దిగా తనకు జరిగిన నష్టాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తోంది. ఈ క్రమంలోనే కీలక ప్రకటన చేసింది.
భారత్ – పాక్ యుద్ధం సందర్భంగా తమ సైన్యానికి చెందిన 11 మందిని కోల్పోయినట్లు పాక్ సైన్యం తాజాగా ప్రకటించింది. మరో 78 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపింది. మృతుల్లో పాక్ వాయుసేనకు చెందిన ఐదుగురు సిబ్బంది, ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు దయాదీ దేశం స్పష్టం చేసింది. వీరిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ కూడా ఉన్నట్లు పేర్కొంది.మరోవైపు ఆపరేషన్ సిందూర్ ద్వారా 40 మంది పౌరులు చనిపోగా.. 121 మందికి గాయాలైనట్లు పాక్ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్పీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
భారత్ దాడుల్లో చనిపోయిన 40 మంది పౌరుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఏడుగురు మహిళలతో పాటు, 15 మంది చిన్నారులు ఉన్నట్లు స్టేట్ మెంట్ ఇచ్చింది. అటు గాయపడ్డ వారిలో 10 మంది మహిళలు, 27 మంది చిన్నారులు ఉన్నట్లు వివరించింది. చనిపోయిన సైనికులు, పౌరులకు.. యావత్ దేశం నివాళులు అర్పిస్తోందని పేర్కొంది. పాక్ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే ఏ చర్యనైన సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా ఆ దేశ సైన్యాధికారులు తెలియ జేశారు.
Also Read: Case Filed on Aghori: లేడీ అఘోరీ రాసలీలలు.. తెరపైకి మరో యువతి.. ఏకంగా రేప్ కేసు నమోదు
ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ)ల స్థాయి చర్చలు జరిగాయి. హాట్‌లైన్ (ప్రత్యేక టెలిఫోన్) ద్వారా మీటింగ్ నిర్వహించారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఇరువైపుల నుంచి ఒక తూటా కాల్చకుండా సంయమనం పాటించాలని భేటిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.