Nara Lokesh: ఉమ్మడి కడప జిల్లా గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు కాంగ్రెస్.. ఆ తర్వాత నుంచి 2019 ఎన్నికల వరకూ వైసీపీకి (YSR Congress) కంచుకోట. వీటన్నింటికీ మించి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సొంత జిల్లా. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి రెపరెపలాడిన ఫ్యాన్.. 2024 ఎన్నికల్లో చతికిలపడింది. ఇంకా చెప్పాలంటే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఊహించని రీతిలో ఫ్యాన్ పార్టీకి రెక్కలు ఊడిపోయాయి. సైకిల్ జోరులో అనుకున్నదానికంటే ఎక్కువే సీట్లు దక్కాయి. పులివెందుల నుంచి వైఎస్ జగన్, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వేల్ నుంచి దాసరి సుధ తప్ప మిగిలిన వైసీపీ అభ్యర్థులు అంతా ఘోర పరాజయం పాలయ్యారు. తెలుగుదేశం (Telugu Desam) చరిత్రలోనే తొలిసారి ఈ రేంజిలో సీట్లను దక్కించుకున్నది. ఇవన్నీ ఒకెత్తయితే జనసేన కూడా రైల్వే కోడూరులో విజయదుందుభి మోగించింది. బహుశా ఇన్ని సీట్లు వస్తాయని కానీ.. ప్రజలు ఇంతలా ఆదరిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, యువనేత నారా లోకేష్ కూడా కలలో కూడా ఊహించి ఉండరని రాజకీయ విశ్లేషకులు, జిల్లా సీనియర్ నేతలు చెబుతుంటారు. ఇంతలా ఆదరించిన జిల్లాకు నాలుగు మంచి పనులు, నలుగురికి నామినేటెడ్ పదవి ఇవ్వలేదని టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆవేదన చెందుతున్నారు.
Read Also-Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. జనసేనకు ఇంతేనా..?
మరిచిరా.. వద్దనుకున్నారా?
2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తర్వాత ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి నుంచి తొలిసారి గెలిచిన మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డికి మాత్రమే క్యాబినెట్‌లో చోటు దక్కింది. మాస్ క్యాండిడేట్, రెడ్డి సామాజిక వర్గం కావడంతో ఆయన్ను పదవి వరించింది. ఆ తర్వాత నామినేటెడ్, ఇతర పదవుల్లో కానీ జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్కరికీ స్థానం దక్కలేదు. దక్కినప్పటికీ అరకొరే. దీంతో వైసీపీ కంచుకోటను బద్దలుకొట్టిన జిల్లాకు ఇంత అన్యాయమా? అసలు కడప జిల్లాను మరిచిపోయారా? లేదంటే గెలిచేశాం కదా ఇంకేం అవసరముందిలే అని వద్దనుకున్నారా? అంటూ సొంత పార్టీ నేతలే అసంతృప్తి వెలిబుచ్చుతున్న పరిస్థితి. వాస్తవానికి నియోజకవర్గానికో నేత.. ఎమ్మెల్యే అభ్యర్థిని మించి కష్టపడిన వారు ఉన్నారు. అలాంటిది వాళ్లను పరిగణనలోనికి తీసుకొని ఏదో ఒకటి నియోజకవర్గ స్థాయి లేదా నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పించలేదేం? అని నిట్టూరుస్తున్నారు. మరీ ముఖ్యంగా జిల్లాలో యువ నేతల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎంతో సీనియార్టీ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను సైతం ఢీ కొట్టిన యువ నేతలు ఉన్నారు.. ఆఖరికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఎదిరించి, ప్రశ్నించిన వారూ ఉన్నారు. అలాంటి వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోకపోవడం ఏంటి? పెద్దాయన చంద్రబాబు కానీ, చినబాబు లోకేష్ కానీ ఎందుకు కడప జిల్లాపై చిన్నచూపు చూస్తున్నారని యువ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also- Amaravati: వైఎస్ జగన్ మళ్లీ గెలిస్తే అమరావతి పరిస్థితేంటి? ఉంటుందా?
వీరి సంగతేంటి?
ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నది. ఇప్పటికే ఎన్నో నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. నిన్నగాక మొన్న కూడా సుమారు 22కు పైగానే పదవులను భర్తీ చేసింది కానీ ఎక్కడా కడప జిల్లాకు చెందిన నేతల పేర్లు కనిపించకపోవడం గమనార్హం. పార్టీ కోసం ఇంత కష్టపడిన తమను కనీసం పట్టించుకోలేదంటూ యువ నేతలు, ద్వితియ శ్రేణి నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరేమో (వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినవారు) చంద్రబాబు, లోకేష్‌ల కంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ఎంతో నయమని.. ఆయన గుర్తు పెట్టుకొని మరీ పదవులు కట్టబెట్టేవారిని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే తాము పార్టీ కోసం ఎంతో కష్టపడటమే కాకుండా.. ఆస్తులు సైతం పోగొట్టుకున్నామని కనీసం ఏదో ఒక కాంట్రాక్ట్ పని ఇచ్చి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఉమ్మడి కడప జిల్లా నుంచి నిస్వార్థంగా పార్టీకోసం పనిచేసిన కార్యకర్తల్ని, నాయకుల్ని గుర్తించండి అంటూ యువ నేతల పేర్లు చెబుతూ.. సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తున్నారు. ఇందులో ప్రొద్దూటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, ఎన్నారై టీడీపీకి చెందిన చెంచు వేణుగోపాల్ రెడ్డి, బద్వేల్ టీడీపీ ఇన్‌ఛార్జ్ రితేష్ రెడ్డిలు ఉన్నారు. వీరికి నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తే బూస్ట్ ఇచ్చినట్లు ఉంటుందని, ఇంకా యాక్టివ్‌గా ఉంటారని ఉమ్మడి కడప జిల్లాకు చెందిన టీడీపీ శ్రేణులు కోరుతున్నారు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు.. ఇకపై నామినేటెడ్ పదవుల్లో ఉమ్మడి కడప జిల్లాకు ప్రాధాన్యత ఇస్తే మంచిది.
Read Also- YS Vijayamma: తల్లి విజయమ్మ నుంచి వైఎస్ జగన్‌కు ఊహించని షాక్?
మా ఉమ్మడి కడప జిల్లా నుంచి నిస్వార్థంగా పార్టీకోసం పనిచేసిన కార్యకర్తల్ని, నాయకుల్ని గుర్తించండి @naralokesh అన్న @ncbn గారు, @JaiTDP పార్టీలో, నామినేటెడ్ పోసిషన్లలో మా వాళ్ళను ఉంచండి.🙏🙏@DrGVPraveenKum1 @bhupeshreddyc @venuchenchu @Rithesh_Badvel #TDPTwitter #Kadapa #tdp pic.twitter.com/a51ywjB28Q
— Vasu Deva Reddy (Kadapa) (@vasureddy1233) May 13, 2025