Future-Of-Amaravati
సూపర్ ఎక్స్‌క్లూజివ్

Amaravati: వైఎస్ జగన్ మళ్లీ గెలిస్తే అమరావతి పరిస్థితేంటి? ఉంటుందా?

Amaravati: రానున్న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సీఎంగా గెలిస్తే అమరావతి పరిస్థితేంటి? ఉంటుందా..? ఉండదా? లేదంటే యథావిధిగా గత వైసీపీ హయాంలో అనుకున్నట్లుగానే మూడు రాజధానులకే (3 Capitals) శ్రీకారం చుడతారా? రాజధాని విషయంలో మాజీ సీఎం మనసులో ఏముంది? ఇంతకీ అమరావతి విషయంలో పార్లమెంట్ చట్టం చేసే అవకాశాలు ఉన్నాయా? లేదా? రాజధాని రీ లాంచింగ్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చట్టం చేసే బాధ్యత, సీఎం చంద్రబాబు (CM Chandrababu) కోరిన డిమాండ్స్ అన్నింటినీ నెరవేరుస్తారా? అసలు ఇవన్నీ సాధ్యమేనా? ఇలా ఒకటా రెండా వందలాది ప్రశ్నలు, అంతకుమించి అనుమానాలు రాష్ట్ర ప్రజలను.. మరీ ముఖ్యంగా రాజధానికి (AP Capital) భూములిచ్చిన రైతులను, భూములు కొన్న బడా బాబులను, ఇప్పటి కూటమి సర్కార్‌ను వెంటాడుతున్నాయి.


Amaravati

ఇప్పుడు సరే.. రేపటి సంగతేంటి?
వైసీపీ (YSR Congress) హయాంలో మూడు రాజధానులు అంటూ జగన్ తెగ హడావుడి చేశారు. అసలు మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదు? అంటూ పలు దేశాలను ఉదహరించి మరీ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘మూడు’ ఉండాల్సిందేనంటూ కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్, వైజాగ్‌ను కార్యనిర్వాహ‌క రాజ‌ధాని, అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ అంటూ అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించారు. అప్పట్లో కోర్టులు, కేసులు అంటూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు.. ఆ పైకోర్టుల వరకూ కూడా ఈ వ్యవహారం వెళ్లింది. అంతేకాదు ఓ వైపు రాజధాని రైతుల భారీగా నిరసన, మరోవైపు ఆందోళనలతోనే సరిపోయింది. న్యాయ పరంగా చిక్కులు ఉండటం, కరోనా మహమ్మారి రావడంతో ఆయన చెప్పిన మూడు రాజధానులకు ఒక్క ఇటుక కూడా పడకుండానే ఐదేళ్ల కాలం గడిచిపోయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలై టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పుడిప్పుడే రాజధాని పనులు ఊపందుకుంటున్నాయి. రెండో విడత కూడా రైతుల నుంచి భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అయితే ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. ఇప్పుడు భూములిస్తున్నాం, ప్రభుత్వం తీసుకుంటుంది సరే.. రేపొద్దున్న వైఎస్ జగన్ గెలిస్తే పరిస్థితేంటి? అన్నది రైతుల నుంచి మిలియన్ డాలర్ల ప్రశ్న. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి వైసీపీ గెలిస్తే జరగబోయే పరిణామాలేంటి? అన్నదే రైతుల ప్రశ్న.


Chandrababu-Modi

చట్టబద్దత చేసేదెవరు?
రాష్ట్ర విభజన చట్టంలో ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అన్న పదం చేర్చాలని.. ఈ మేరకు 2014లో చేసిన చట్టానికి సవరణ చేయాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు గట్టిగానే పట్టుబడుతున్నారు. అందుకే పదే పదే రైతులకు భరోసా ఇస్తూ ‘ఏపీకి ఏకైక రాజధాని అమరావతి’ అంటూ చట్టబద్దత చేయిస్తానంటూ చెబుతూ వస్తున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వంతో కూడా ఈ మాట చెప్పిస్తానంటూ రైతులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇదంతా టెక్నికల్‌గా చూస్తే సాధ్యమేనా? అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకులు, నిపుణుల నుంచి వస్తున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం- 2014 ప్రకారం, రాజ్యాంగంలోని అధికరణ 170లోని నిబంధనలకు లోబడి చట్టంలోని సెక్షన్-15కు భంగం కలగకుండా తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేయడానికే కేంద్రం సిద్ధపడటం లేదు. అంటే చట్టంలో ఉన్నప్పటికీ రాజ్యాంగ సవరణ అవసరమయ్యే విషయం కాబట్టి ఎక్కడికక్కడ బ్రేక్‌లు పడుతున్నాయి. అలాంటిది అమరావతి కోసం రాజ్యాంగ సవరణ చేయడం లేదా ప్రత్యేక చట్టం చేయడం అయ్యే పనేనా? కేంద్ర ప్రభుత్వం ఇంత సాహసం చేస్తుందా? అంటే ప్రశ్నార్థకంగానే పరిస్థితులు ఉన్నాయి.

Amaravati-Re-Launch

మోదీ బాధ్యత తీసుకున్నట్టా?
అమరావతి రీ లాంచ్‌కు ప్రధాని మోదీ వచ్చినంత మాత్రాన.. రాజధాని బాధ్యత ఆయనే తీసుకున్నారా? అంటే కాదనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. అమరావతి విషయంలో చంద్రబాబు అనుసరించే విధానాలన్నింటినీ ప్రధాని సమర్థిస్తున్నారా? అని చెప్పడానికీ లేదు. ఎందుకంటే 2015లో అమరావతికి మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పరిణామాలు మారి సవాళ్లు ఎదురైనప్పుడు.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని విషయం అంటూ కేంద్రం ప్రకటన చేయడమే కాదు.. కోర్టులో తేల్చి చెప్పేసింది. అంటే రాజధాని విషయాన్ని రాష్ట్రమే చూసుకోవాలనే నిర్ధిష్ట విధానానికి మోదీ కట్టుబడి ఉన్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో అమరావతి కోసం ప్రత్యేక చట్టం చేయడం సాధ్యమా? అంటే లేదనే విశ్లేషకులు చెబుతున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే రాజకీయ పరమైన హామీలకు, చంద్రబాబు సొంతంగా ఇచ్చే హామీలకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ బాధ్యత తీసుకోలేదు.. రానున్న రోజుల్లో కూడా తీసుకోదు కూడా అంటూ రాజకీయ విశ్లేషకులు, నిపుణుల నోట ఈ మాటలు వస్తున్నాయి.

Chandrababu-And-Modi

నాడు.. నేడు..!
ఇంకా లోతుగా వెళ్లి చర్చించాల్సి వస్తే.. 2014లో రైతు రుణమాఫీపై అలవిగాని ప్రకటనలు చేసిన చంద్రబాబు.. అదే హామీని నెరవేర్చడంలో విఫలం కావడం తెలుగు ప్రజలందరికీ తెలుసు. అప్పట్లోనే దీనిపైన కేంద్రం స్పందిస్తూ ఇది కేవలం చంద్రబాబు ఇచ్చిన హామీ కాబట్టి, అమలు చేయాల్సిన బరువు బాధ్యతలు కూడా ఆయనపైనే ఉన్నాయని కేంద్రం తేల్చి చెప్పేసింది. దీన్ని బట్టి చూస్తే.. పరిపాలనా పరమైన విషయాలు, కేంద్ర ప్రభుత్వ బాధ్యత.. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఇచ్చే హామీలు.. ఈ మూడూ వేర్వేరు విషయాలు అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఒకే ఒక్క పాజిబులిటీ మాత్రమే ఉంది. ప్రస్తుతం రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉంది గనుక.. న్యాయస్థానం చెప్పే తీర్పును బట్టి రాజధానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉండొచ్చు. అంతేకానీ.. పార్లమెంట్‌తోనో, ప్రధాని మోదీతోనో ‘ఏపీకి ఏకైక రాజధాని అమరావతి’ అని చెప్పిస్తాం, రక్షణ కల్పిస్తామని చెబితే మాత్రం అవన్నీ కేవలం రాజకీయ పరంగా బుజ్జగింపు మాటలనే అనుకోవాలని తప్పితే మరొకటి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Modi-And-Babu-And-Jagan

భారీ, అతి భారీ వర్షాలు కురిస్తే..?
ఈ క్రమంలోనే అమరావతిపైన మరికొన్ని అనుమానాలు సైతం రాష్ట్ర ప్రజల్లో వస్తున్నాయి. ఈ మధ్యనే కురిసిన గంటపాటు కురిసిన వర్షాలకే అమరావతి దాదాపు మునిగిపోయిన పరిస్థితిని మనందరమూ టీవీలు, దినపత్రికలు, సోషల్ మీడియాల్లో చూశాం. దీంతో భారీ, అతి భారీ వర్షాలు కురిస్తే పరిస్థితేంటి? అనేది పెద్ద ప్రశ్నే. ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పటికే అమరావతికి వచ్చిన వరద నీరు ఎత్తిపోతలకే అయ్యే ఖర్చు రూ.2750 కోట్లు అనే ప్రచారం పెద్ద ఎత్తునే నడుస్తోంది. అన్ని రిజర్వాయర్లు కట్టాలంటే ఎన్ని గ్రామాలు పోతాయో? వారికి ఎలా న్యాయం చేస్తారో? చూడాలని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాకుండా అమరావతి కట్టటానికి, వరదలు ఆపేందుకు, ప్రపంచ బ్యాంక ఇతర అంతర్జాతీయ బ్యాంకులు ఇస్తున్న అప్పు రూ.60,000 కోట్లు అని చర్చ జరుగుతోంది. ఇక్కడే తెస్తున్న అప్పులన్నీ అమరావతిలోకి వరద నీరు రాకుండా చేసే ప్రాజెక్టులకే సరిపోతే, ఇప్పటి వరకూ అనుకుంటున్న సింగపూర్, మలేషియా లాంటి అద్దాల మేడలు,ఆకాశ హర్మ్యాలు కట్టేదెపుడు? అనేది ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు లేకపోలేదని ప్రత్యర్థుల నుంచి విమర్శలు సైతం వస్తున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే శివరామ కృష్ణన్ రిపోర్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతి ప్రాంతం రాజధానికి ఏమాత్రం అనుకూలం కాదని, వరదలొస్తే, భారీ ప్రాణ నష్టం జరుగుతుందని, దీంతోపాటు సారవంతమైన భూములు మూడు పంటలు రైతులు పండించుకోవచ్చని కమిటీ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు వైఎస్ జగన్ ఇన్నాళ్లు చెప్పిన మూడు రాజధానులు నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాలకు సమన్యాయం చేపట్టి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేవారు లేకపోలేదు. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారు? ప్రధాని మోదీ ఏ మాత్రం చట్టబద్ధత చేసి చూపిస్తారు? రానున్న ఎన్నికల్లో జగన్ గెలిస్తే అమరావతిని ఏం చేస్తారు? అనేది వేచి చూడాల్సిందే మరి.

Read Also-YS Vijayamma: తల్లి విజయమ్మ నుంచి వైఎస్ జగన్‌కు ఊహించని షాక్?

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు