Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి వరుసగా మూడో రోజు భారత సైన్యం మీడియా సమావేశం నిర్వహించింది. భారత్ లోని 36 ప్రాంతాలపైకి పాక్ 300-400 వరకూ డ్రోన్లు ప్రయోగించిందని భారత సైన్యం ప్రతినిధి కర్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sophia Qureshi) తెలిపారు. భారత గగనతల రక్షణ వ్యవస్థను పరీక్షించడం, నిఘా సమాచార సేకరణే లక్ష్యంగా పాక్ ఈ దాడుల చేసిందని ఆమె తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం తుర్కియే తయారీ డ్రోన్లను పాక్ ప్రయోగించినట్లు సోఫియా ఖురేషీ తెలిపారు. పాక్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తోందని పేర్కొన్నారు.
మరోవైపు మీడియాతో మాట్లాడిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. భారత దాడిలో పాక్ కు తీవ్ర నష్టం వాటిల్లినట్లు చెప్పారు. పాక్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తోందని తెలిపారు. కరాచీ – లాహోర్ సమయంలో విమానాలు తిరుగుతున్నాయని.. అవి ప్రయాణిస్తున్న సమయంలో భారత్ ఎంతో సంయమనం పాటించిందని తెలిపారు. విమానాలు ప్రయాణించే ఎయిర్ స్పేస్ ను మూసివేసినట్లు పాక్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె తేల్చి చెప్పారు.
అటు పాక్ దాడుల నేపథ్యంలో పంజాబ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు సైన్యం తెలిపింది. పాక్ దాడుల్లో అనేక మంది గాయపడినట్లు పేర్కొంది. ప్రార్థన మందిరాలే లక్ష్యంగా పాక్ ఈ దుశ్చర్యలకు తెగబడుతోందని సైన్యం ఆరోపించింది. ముఖ్యంగా సిక్కులకు సంబంధించిన గురుద్వారాలపై దాడికి యత్నిస్తూ దేశంలో మత కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని సైన్యం తెలిపింది.
మరోవైపు పాక్ విదేశాంగ శాక కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ.. గురువారం రాత్రి చేసిన దాడుల్లో పాక్ కే ఎక్కువ నష్టం కలిగిందని అన్నారు. చాలా సార్లు పాక్ సీజ్ ఫైర్ ఉల్లంఘనలకు పాల్పడిందని తెలిపారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదని పాక్ చెప్పడం పూర్తిగా అబద్ధమని విక్రమ్ మిస్రి తెలిపారు. పూంచ్ లోని స్కూల్ పైనా పాక్ దాడి చేసిందని.. ఆ సమయంలో పాఠశాల మూసివేసి ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వివరించారు. పాక్ చర్యలపై మరోసారి IMFకు ఫిర్యాదు చేస్తామని మిస్రి స్పష్టం చేశారు.