Miyapur Phase 5: అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులే నిర్మాణ దారులకు అండగా నిలుస్తున్నారంటూ మియాపూర్ జనప్రియ ఫేజ్ -5 లో నివాసముంటున్న కుటుంబాలు ఆందోళనకు దిగాయి. జనప్రియ ఫేజ్ -5కి చెందిన ఓపెన్ స్థలాన్ని తమ సెట్ బ్యాక్ గా చూపించి అనుమతులు తీసుకున్న ప్రైవేటు నిర్మాణదారునికి జిహెచ్ఎంసి, టౌన్ ప్లానింగ్ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు.
గత 18 నెలలుగా ఎమ్మెల్యే, కార్పొరేటర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లను కలిసి సమస్యలను వివరించామన్నారు. తమ మిగులు స్థలాన్ని వినియోగించుకుంటూ తమకే ఇబ్బందులు సృష్టిస్తున్న నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Also Read: Maoists Surrendered: ప్రజల మధ్యే శాంతి.. మావోయిస్టుల కొత్త జీవన యాత్ర!
తమ కాలనీ కి వచ్చే మంజీరా పైప్ లైన్ నుంచి అపార్ట్మెంట్ కి కనెక్షన్ తీసుకోవడంతో పాటు కాలనీ డ్రైనేజీ లోనే అపార్ట్ మెంట్ల డ్రైనేజీని కలిపేందుకు గోతులు సైతం తీసినట్లు తెలిపారు. దీనిపై ఎంతమందికి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జనప్రియ వాసులకు ఇబ్బందులు కలుగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెదిరింపులకు పాల్పడుతున్న బిల్డర్
జనప్రియ ఫేజ్ -5 లోని 650 కుటుంబాలు పక్కనే కొనసాగుతున్న అపార్ట్ మెంట్ల తీరుపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తుండడంతో సదరు బిల్డర్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిరసన దీక్ష చేస్తున్న కుటుంబాలు వాపోతున్నాయి. అపార్ట్ మెంట్లకు మంజీరా కనెక్షన్ ను అడ్డుకుంటే భవిష్యత్తులో మీకు కూడా మంజీరా నీళ్లు దొరకకుండా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
జనప్రియకు చెందిన సెట్ బ్యాక్ ల్యాండ్స్ లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయడంతోపాటు, అదే స్థలాన్ని సెట్ బ్యాక్ గా చూపించి అనుమతులు పొందినట్లు జనప్రియ వాసులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ వారు కోరుతున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు