High Security in Hyderabad: పాక్ ముష్కరులు చేసిన పహల్గాం దాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) చేపట్టిన సంగతి తెలిసిందే. తమ దేశంలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేయడంతో పాక్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఒకవేళ పాక్ వక్రబుద్ధి ప్రదర్శించి ఎదురుదాడికి ప్లాన్ చేస్తే.. దాని టార్గెట్ దేశంలోని ప్రధాన నగరాలే కావొచ్చని నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ముఖ్య నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచన మేరకు నగరంలో భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు.
భద్రతా బలగాల పహారా!
హైదరాబాద్ లో రక్షణ రంగం, సైన్యానికి సంబంధించిన కీలక సంస్థలు చాలా ఉన్నాయి. DRDO, నీసా (National Industrial Security Academy), బీడీఎల్ (BDL), ఈసీఐఎల్ (ECIL), ఎన్ ఎఫ్ సి (NFC) వంటి ప్రముఖ కేంద్ర సంస్థలు ఇక్కడి నుంచే విధులను నిర్వర్తిస్తున్నాయి. వీటితో పాటు ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Micro Soft), డెల్ (Del) తదితర సంస్థలు నగరంలో కార్యాలయాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా నగర పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆయా సంస్థల వద్ద కేంద్ర బలగాలతో కలిసి భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మిస్ వరల్డ్ అతిథులకు భద్రత
మరోవైపు తెలంగాణలో మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచం నలుమూల నుంచి అందాల భామలు, మీడియా సంస్థలు నగరానికి విచ్చేశాయి. ఈ నేపథ్యంలో అతిథులకు సైతం నగర పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అతిథులు ఉండే హోటల్స్ వద్ద భారీ భద్రతను కల్పించారు. అంతేకాదు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుంచి నగర పరిస్థితులను ఎప్పటికప్పుడు సిటీ కమిషనర్ సి.వి ఆనంద్ (C.V. Anand) పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Karregutta Blast: వరంగల్ లో భారీ పేలుడు.. ముగ్గురు జవాన్లు మృతి.. క్షణ క్షణం ఉత్కంఠ!
సోషల్ మీడియాపైనా ఫోకస్
ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు చక్కర్లు కొట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా హ్యాండిల్స్ పైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. అనుమానస్పదంగా ఉన్న పోస్టులు, తప్పుడు ప్రచారాలపై కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ప్రజలు సైతం సోషల్ మీడియా పుకార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని సూచిస్తున్నారు. ఉద్రిక్తతలు చల్లారేవరకూ సోషల్ మీడియాను హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) నిరంతరం మానీటరింగ్ చేయనున్నారు.