Karregutta Blast: మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ ను చేపట్టిన తెలిసిందే. గత కొన్ని రోజులుగా చత్తీస్ గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో కేంద్ర బలగాలు.. కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కర్రెగుట్ట అడవుల్లో వందలాది మంది నక్సల్స్ నక్కి ఉన్నారన్న పక్కా సమాచారం భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో పలువురు నక్సల్స్ ను సైతం జవాన్లు మట్టుబెట్టారు. అయితే తాజాగా కర్రెగుట్టల్లో భారీ పేలుడు సంభవించింది. జవాన్లకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ముగ్గురు స్పాట్ డెడ్
ములుగు జిల్లా వెంకటాపురం మండలోని సరిహద్దుల్లో కర్రెగుట్ట అడవుల్లో ఇవాళ ఉదయం భారీ శబ్దంతో పేలుడు వినిపించింది. బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ముగించుకొని వస్తుండగా నక్సల్స్ అమర్చిన ల్యాండ్ మైన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ముగ్గురు తెలంగాణ గ్రేహౌండ్స్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
నక్సల్స్ ఎదురుకాల్పులు!
మరోవైపు ల్యాండ్ మైన్ పేలిన అనంతరం.. నక్సల్స్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు సమాచారం. బలగాలపై తుపాకులతో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లోనూ కొందరు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఆపరేషన్ కగార్ ను ఎదుర్కొనేందుకు కర్రెగుట్ట కింది భాగంలో భారీగా ల్యాండ్ మైన్లను మావోయిస్టులు అమర్చారు. వాటిని దాటుకొని నక్సల్స్ దాక్కున్న ప్రాంతాలకు వెళ్లడం గ్రేహౌండ్స్ బలగాలకు సవాలుగా మారుతోంది.
Also Read: Gold Rate Today : భారీగా పెరిగి బిగ్ షాక్ ఇచ్చిన గోల్డ్.. ఒకేసారి అంత పెరిగిందేంటి?
22 మందికి పైగా మృతి
ఆపరేషన్ కగార్ కారణంగా ములుగు జిల్లాలోని కర్రెగుట్ట అడవులు బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. గ్రేహౌండ్స్ బలగాలు.. మావోల మధ్య జరుగుతున్న కాల్పులకు అటవీ ప్రాంతం మార్మోగుతోంది. ఇప్పటివరకూ 22 మందికి పైగా మావోయిస్టులు ఈ ఆపరేషన్ చనిపోయారు. అయితే దట్టమైన అడవి, ఎండ తీవ్రత, నీటి కొరత కారణంగా ఆపరేషన్ కగార్ కు ఆటంకం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచిస్తున్నారు. మానవీయ కోణంలో నక్సల్స్ తో శాంతి చర్చలు జరపాలని కోరుకుతున్నారు.