Korsa Narasimha Murthy: బహుళజాతి మొక్కజొన్న కంపెనీలు చేసిన మోసానికి కుదేలైన రైతులు నష్టపరిహారం కోసం డెబ్భై రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే గాంధీ భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు. పూసూరు బ్రిడ్జి వద్ద ఏడువండల మంది మొక్క జొన్న రైతులు జాతీయ రహదారి పైన సుమారు రెండు గంటల పాటు బైఠాయించి రాస్తారోకో, ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా ఆదివాసి నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నరసింహమూర్తి మాట్లాడుతూ… నష్టపోయిన రైతులకు ఇస్తాన్నన్న నష్టపరిహారం ఇవ్వకుండా ఆర్గనైజర్లు, కంపెనీ ఉద్యోగులు అడ్డుపడుతున్నారన్నారు. డెబ్భై రోజుల నుండీ ఏజెన్సీ రైతులు ఆందోళన చేస్తూ ఉంటే నష్టపరిహారం ఇస్తామని తాత్సరం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కొందండ రెడ్డి ముందు హైటేక్, సింజెంట, మాన్సెంట, బెయర్ కంపెనీల ఆర్గనైజర్లు, కంపెనీల ఉద్యోగులు రైతులకు అణా పైసా కూడా పెట్టుబడి పెట్టలేదని చెప్పి నేడు అబద్ధపు అగ్రిమెంట్లకు చేసుకొని రైతులకు పరిహారం ఉండకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Also Read: Warangal Crime: పట్టపగలే ప్రాణహాని.. మహిళపై గొడ్డలితో దాడి కలకలం!
జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఆర్గనైజర్లకు మనీ ల్యాండరింగ్ నోటీసులు ఇస్తే ఏ ఒక్క రైతుకు అప్పులు ఇవ్వలేదని వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. నష్టపరిహారం చెల్లిస్తానని ఆర్గనైజర్లు, కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్లు ఒప్పుకుని కలెక్టర్ ముందు సంతకాలు పెట్టారని తెలిపారు. సుమారు పదిహేను కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లు కంపెనీలు తెలిపాయని అన్నారు. ఎకరం సాగు చేసిన రైతు పైన డెబ్భై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినట్టు హైటేక్ కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్ ఒక తప్పుడు నివేదిక కలెక్టర్ కు సమర్పించినట్టు వివరించారు. కానీ వాస్తవానికి బ్యాంక్ ఖాతా నుండీ ఒక్కో ఎకరానికి రైతుకు ఆర్గనైజర్ చెల్లించింది.. రూ.20,000 నుండి రూ.30,000 వేలను రైతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించడం ద్వారా కలెక్టర్ గుర్తించారని పేర్కొన్నారు.
ఆర్గనైజర్లు జిల్లా కలెక్టర్ ని, వ్యవసాయ అధికారులను రాజకీయ ఒత్తిడులకు గురి చేసి వాళ్ళ పని వారు చేసుకోకుండా అడ్డు పడుతున్నారని అన్నారు. ఏ, బి, సి గ్రేడ్లు రద్దు చేసి అందరికి ఒకే గ్రేడ్ ఇచ్చి ఎకరానికి రూ.85,000 కంపెనీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కంపెనీ ఆర్గనైజర్ల పైన బలమైన కేసులు పెట్టక పోవడం కారణంగానే బయట ఉండి అధికారులను, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పైనే రైతులు నమ్మకం పెట్టుకొని ఉన్నారని అన్నారు. కంపెనీ ఆర్గనైజర్ల దుశ్చర్యలతో రైతుల ఆశలు ఆడియాశలు అయ్యాయని రైతులు వాపోయారు.
Also Read: Hyderabad Crime: మద్యం మాయ.. సోదరుల మధ్య తగాదా.. బావ హత్యకు దారి!
స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని చిత్త మిశ్రా రావాలని రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు గంటలైనా అధికారులు ఎవరు రాకపోవడం తో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని లేవాలని సి ఐ బండారి కుమార్, వాజేడు, వెంకటాపురం ఎస్సై లు రాజ్ కుమార్, కొప్పుల తిరుపతి రావు రైతులను బలవంతంగా లేపే ప్రయత్నం చేశారు. రైతులు ఎమ్మెల్యే వచ్చేదాకా లేసేది లేదని భీష్మించుకుకూర్చున్నారు.
చివరికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చరవాణి ద్వారా రైతులతో మాట్లాడించారు. వారం రోజుల్లో రైతులకు నష్టపరిహారం చెల్లించక పొతే త్వరలోనే ప్రగతి భవన్ ని ముట్టడి చేస్తామని రైతులు, నవనిర్మాణ సేన బాధ్యులు హెచ్చరించారు. రేపు వెంకటాపురం వస్తానని వచ్చిన తర్వాత రైతులతో అన్ని విషయాలు మాట్లాడి నష్టపరిహారం అందేలాగా చూస్తానని ఎమ్మెల్యే వెంకట్రావు హామీ ఇవ్వడం తో రైతులు ధర్నా విరమించారు.
ఈ రాస్తారోకో, ఆందోళన కార్యక్రమంలో జి ఎస్పీ జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్, గిరిజన సంఘం నాయకులు జెజ్జరీ దామోదర్ మద్దతు ప్రకటించారు. అండగా ఉంటామని తెలిపారు. ఏ ఎన్ ఎస్ నాయకులు మోడెం నాగరాజు, కుంజ మహేష్, రైతు నాయకులు పాయం రాంబాబు, నాగుల ప్రవీణ్, చేలే రాజేష్, జాడి ఈశ్వర్, సాంబ మూర్తి, రైతులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు