Simhachalam Incident: ఆంధ్రప్రదేశ్‌లో సింహాచలం ఘటన ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చందనోత్సవం వేళ సింహాచలం ఆలయంలో (Simhachalam Temple) గోడ కూలి ఏడుగురు భక్తులు కన్నుమూశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఏడుగురు అధికారులపై వేటు వేసింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యుల గుర్తించిన ప్రభుత్వం.. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో పాటు కాంట్రాక్టర్‌ను కూడా బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సింహాచలం ఆలయ ఈవో కె.సుబ్బారావు, ఆలయ ఈఈ డి.జి.శ్రీనివాసరాజు, పర్యాటక సంస్థ ఈఈ కె.రమణ, ఆలయ డీఈ కేఎస్‌ఎస్ మూర్తి, పర్యాటక సంస్థ డీఈ ఆర్వీవీఎల్‌ఆర్ స్వామి, పర్యాటక సంస్థ ఏఈ పి.మదన్‌మోహన్, ఆలయ ఏఈ కె.బాబ్జీ, దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, గోడ నిర్మాణానికి ఎలాంటి ప్లాన్, డిజైన్ లేకపోవడం మొదలుకొని నాణ్యత పాటించకపోవడం, ఇంజినీర్లు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రమాదానికి దారితీశాయని త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది.
Read Also- Earthquake: ఏపీని భయపెట్టిన భూకంపం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..
నివేదికలో ఏముంది?
కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నిర్దారించింది. తీవ్ర నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలు కోల్పోవడానికి కాంట్రాక్టర్, అధికారులు కారణమయ్యారని కమిటీ తేల్చింది. కమిటీ సిఫారసు ఆధారంగా చర్యలకు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. కమిటీ నివేదికను నిశితంగా పరిశీలించిన అనంతరం దేవాదాయ, పర్యాటక శాఖకు చెందిన ఏడుగురు అధికారుల సస్పెన్షన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.‘ గోడకు ఎలాంటి డిజైన్, డ్రాయింగ్స్ లేవు. నిర్మాణానికి డిజైన్ లేదు. డ్రాయింగ్, ప్లాన్ రూపొందించలేదు. ఆ గోడ అధిక బరువును తట్టుకునేలా లేదు. కనీసం పునాది కూడా లేదు. నేరుగా నేలపైనే గోడ నిర్మించేశారు. నాణ్యతలేని ఫాల్-జి ఇటుకలు వాడారు. ఆఖరికి నిర్మాణానికి వాడిన సిమెంట్‌లోనూ నాణ్యత లేదు. ముఖ్యంగా గోడకు సరిగ్గా క్యూరింగ్ కూడా చేయలేదు. సమీపంలో తవ్విన మట్టి, శిథిలాలను గోడ వెనుక పోయడంతో దానిపై ఒత్తిడి మరింత పెరిగింది. నీటిని అడ్డుకునేలా గోడ నిర్మాణం జరిగింది. సహజంగా వచ్చే వర్షపునీటి ప్రవాహానికి గోడ అడ్డుగా నిలిచింది. నీరు పోయేందుకు డ్రైనేజీ, గోడపై ఒత్తిడి తగ్గించి నీరు బయటకు వెళ్లేలా వీప్ హోల్స్ ఏర్పాటు చేయకపోవడం ప్రమాదానికి కారణం. అసలే బలంగా లేని గోడకు, ఉత్సవం కోసం వేసిన తాత్కాలిక షెడ్ల సపోర్టు బీమ్‌లను దన్నుగా ఏర్పాటు చేయడం, దీనికితోడు భారీ గాలి, వర్షంతో గోడపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇలా ప్రతిదశలోనూ అధికారులు తీవ్రనిర్లక్ష్యం చూపించారు’ అని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కమిటీ పేర్కొన్నది.
Read Also- Varun Tej: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్ తేజ్ .. తండ్రి కాబోతున్నా అంటూ పోస్ట్..
సీఎం తీవ్ర అసంతృప్తి..
దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. గత కొన్ని రోజులుగా దేవాదాయ శాఖ పరిధిలో జరిగిన సంఘటనలపై నిశితంగా సమీక్షలో చర్చించనున్నారు. మరీముఖ్యంగా తిరుపతి తొక్కిసలాట, సింహాచలం ఘటన నేపథ్యంలో భక్తుల భద్రత, ప్రశాంత దర్శనం, ఇతర అంశాలపై కీలకంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భక్తులకు వివిధ ఉత్సవాల సమయంలో ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది. కాగా, తిరుమల, సింహాచలం సంఘటనలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో దేవాదాయ శాఖలో కొన్ని కీలక సంస్కరణల దిశగా ఏపీ సర్కార్ అడుగులు వస్తోంది. ఈ సమీక్ష అనంతరం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం కూడా జరగనుంది. సాయంత్రం బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.
Read Also- Singer Pravasthi: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ ప్రవస్తి.. ఒక్క దెబ్బకి అందరికీ ఇచ్చిపడేసిందిగా..!