Kesineni Nani: రాజకీయంగా బద్దశత్రువులుగా మారిన కేశినేని బ్రదర్స్ మధ్య రోజురోజుకూ ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ల (Kesineni Chinni) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ మంటలు మరింత తీవ్రమవుతున్నాయే తప్ప ఆరే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే చిన్నికి సంబంధించిన బాగోతాలను రెండ్రోజులకొకటి చొప్పున నాని బయటపెడుతూనే వస్తున్నారు. దీంతో తమ్ముడిని అన్న ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే టాక్ జిల్లా రాజకీయాల్లో గట్టిగానే నడుస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇప్పుడో లెక్క అన్నట్లుగా ఈసారి ఏకంగా ఓ సంచలన లేఖను నేరుగా సీఎం చంద్రబాబుకే (CM Chandra Babu) రాశారు. ఇందులో పక్కా ఆధారాలు సైతం ఉండటంతో ముఖ్యమంత్రి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంత జరిగిన తర్వాత అయినా చర్యలుంటాయా? అనే ప్రశ్నలు, అంతకుమించి అనుమానాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ లేఖ సారాంశం ఏమిటో చూసేద్దాం రండి..
Read Also- Pawan Kalyan: స్నేహపూర్వకంగా పరిష్కరించాలి.. పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన
లేఖలో ఏముంది?
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారంలో అరెస్టయిన కీలక వ్యక్తులతో కేశినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి ‘ఎక్స్’ వేదికగా కీలక వివరాలు బయటపెట్టారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఈ పేరు గతకొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు కూడా. మరోవైపు రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు, పీఏ దిలీప్ పైలా విదేశాలకు పారిపోయేందుకు యత్నించగా సిట్ బృందం పట్టుకుంది. దిలీప్ వద్ద మద్యం కేసులో కీలక సమాచారం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే కేశినేని నాని బాంబ్ ‘ఎక్స్’ వేదికగా పేల్చారు. పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో అరెస్టయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దిలీప్ పైలాతో కేశినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి తన వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని కేశినేని నాని లేఖలో సంచలన విషయాలను పేర్కొన్నారు. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకీ లక్ష్మీతో కలిసి ‘ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్ఎల్‌పీ’ అనే సంస్థలో భాగస్వాములుగా ఉన్నారని నాని వెల్లడించారు. అంతేకాదు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ప్లాట్ నెం.9, సర్వే నెం.403 చిరునామాతో ఈ సంస్థ నమోదైందని కూడా చంద్రబాబుకు రాసిన లేఖలో నాని నిశితంగా వివరించారు. ఇవన్నీ ఒకెత్తయితే ఇదే సమయంలో కసిరెడ్డి, దిలీప్ పైలా నిర్వహిస్తున్న ‘ఇషాన్వి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కూడా ఇదే చిరునామాతో కార్యకలాపాలు సాగిస్తోందని మాజీ ఎంపీ నాని తేల్చి చెప్పేశారు. ఈ రెండు సంస్థలు ఒకే అధికారిక ఈ-మెయిల్ ఐడీని వినియోగిస్తున్నాయని కూడా తెలిపారు. ఇదంతా రెండు సంస్థల మధ్య ఉద్దేశపూర్వక కార్యాచరణ సంబంధాన్ని స్పష్టం చేస్తోందని ఆయన చెప్పారు.
Read Also- BRS Party: అంతా నేనే.. పార్టీ నాదే.. తెగేసి చెప్పిన కేటీఆర్.. కవిత, హరీశ్ బిగ్ ప్లాన్!
తీవ్ర ఆందోళన కలిగిస్తోంది..
మద్యం కుంభకోణం కేసులో ఇద్దరు కీలక వ్యక్తులు అరెస్టయిన క్రమంలో సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్నికి వారితో ప్రత్యక్ష సంబంధాలుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని నాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ స్కామ్‌లో నిధులను పెద్ద మొత్తంలో చిన్ని అక్రమంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించారని తనకు సమాచారం ఉందని కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో లెక్కల్లో చూపని సంపదను దాచిపెట్టడానికి, మనీ లాండరింగ్‌కు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే జోక్యం చేసుకుని, ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని నాని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జరిగే ఇలాంటి అక్రమాలను, నిందితులతో సంబంధాలను విచారించకుండా వదిలిపెట్టొద్దని, రాజకీయ పలుకుబడి చట్టానికి, జవాబుదారీతనానికి అడ్డుకాకుండా చూడాలని ముఖ్యమంత్రిని నాని కోరారు. ఈ వ్యవహారంపై నిర్ణయాత్మక చర్యలు తీసుకుని న్యాయాన్ని నిలబెట్టాలని లేఖలో సీఎంకు మాజీ ఎంపీ విజ్ఞప్తి చేశారు. కాగా, ఇప్పటికే తన సోదరుడికి సంబంధించిన విశాఖ భూ కేటాయింపులు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే ఇప్పుడు ఏకంగా లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేయడంతో ఇప్పుడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. ఈ లేఖకు చంద్రబాబు కనీసం స్పందిస్తారా? రియాక్ట్ అయితే చంద్రబాబు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి? అని అటు టీడీపీలో ఇటు వైసీపీలో తీవ్ర చర్చే నడుస్తోంది.
Respected @ncbn garu,
I am writing this to bring to your urgent attention serious and credible information connecting the MP,Vijayawada, Kesineni Sivanath (Chinni), to individuals arrested in the Andhra Pradesh liquor scam, particularly Kesireddy Rajasekhar Reddy and his close… pic.twitter.com/pgiIbNtXZ5— Kesineni Nani (@kesineni_nani) May 5, 2025