Caste Census Survey: కులగణన.. ఇన్నాళ్లూ ఇదో స్టేట్ ఇష్యూ. ఇకపై నేషనల్ ఇష్యూ. జనగణనతోపాటు కులగణన (Caste Census) చేపడుతామని కేంద్రంలోని ఎన్డీఏ (NDA) సర్కార్ ప్రకటించింది. ఏ క్షణమైతే ఈ నిర్ణయం బయటకొచ్చిందో కాంగ్రెస్ (Congress) కు పెద్ద అస్త్రం దొరికినట్టయింది. ఎందుకంటే, కులగణన చేపట్టాలని మొదట్నుంచి ఈ పార్టీ పోరాటం చేస్తున్నది. ఎన్నో ఏళ్లుగా కులగణన అంశం చుట్టూ రాజకీయం చేస్తూ వస్తున్నది. మరీ ముఖ్యంగా తెలంగాణలో 2018, 2023 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి ఓట్లు అడిగింది. అలాగే, తాము అధికారంలోకి వస్తే దేశమంతా అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, హస్తం పార్టీ దేశమంతా అధికారం చేపట్టలేదు. తెలంగాణలో మాత్రం గెలిచింది. చెప్పినట్టుగానే కులగణనను అమలు చేసింది.
తెలంగాణలో కులగణన
వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ (Telangana) ప్రభుత్వం గతేడాది(2024) నవంబర్ 6న కులగణన మొదలుపెట్టింది. మొదటి రెండు రోజులు ఇంటింటికి వెళ్లి సర్వే సమాచారాన్ని సిబ్బంది ఇచ్చారు. తర్వాత నవంబర్ 9 నుంచి సమగ్ర ఇంటింటి సర్వే మొదలైంది. ఈ సర్వే కోసం లక్ష మందికి పైగా ఇన్యుమరేటర్లు, 18వేల మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. అలా, రెండు నెలలు ఎంతో కష్టపడి ఇంటింటికీ తిరిగి సమాచారాన్ని సేకరించారు. చివరకు ఈ ఏడాది(2025) ఫిబ్రవరి 3న వివరాలన్నీ బయటపెట్టింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 96.9 శాతం మంది తమ వివరాలను వెల్లడించినట్టు ప్రకటించింది.
తెలంగాణలో జరిపిన సర్వే వివరాలు
మొత్తం 3,54,77,554 మంది వివరాల నమోదు
1,12,15,131 కుటుంబాల వివరాల సేకరణ
మొత్తం బీసీలు 46.25 శాతం మంది
ఎస్సీలు 17.43 శాతం మంది
ఓసీలు 15.79 శాతం మంది
ఎస్టీలు 1.45 శాతం మంది
ముస్లింలు(బీసీ) 10.08 శాతం మంది
ముస్లింలు(ఓసీ) 2.48 శాతం మంది
Read Also- Jagga Reddy: రాజకీయాల్లో రాహుల్ గాంధీ హీరో.. జగ్గారెడ్డి సంచలన కామెంట్స్!
అసలు ఎందుకీ కులగణన?
రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం, అన్ని సామాజిక వర్గాలకు ఆర్థిక, సామాజిక న్యాయం జరగాలి. కానీ, ఏళ్లు గడుస్తున్నా అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలాచోట్ల వెనుకబడిన కులాల వారికి సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. ఆర్థికంగా కూడా వారు ఎదగడం లేదు. ఇప్పటికీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి జనాభా ప్రాతిపదికనే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్న పరిస్థితి. బీసీల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాల ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని జనాభా ఎంత, కులాల లెక్కలేంటో తెలుసుకుని రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాలు అర్హులకు అందజేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ దేశమంతా కుల గణన అంశాన్ని తెరపైకి తెచ్చింది. 2023 తెలంగాణ ఎన్నికలప్పుడు, బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. అంతకుముందు, 2018 ఎన్నికల సమయంలోనూ కులగణన అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచింది.
ఎట్టకేలకు కేంద్రం నుంచి సుముఖత
దేశంలో జనగణన చాలా ఆలస్యమైంది. 2021లోనే చేయాల్సి ఉన్నా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నది. అయితే, కేంద్రం ఈ మధ్యే దీనిపై సుముఖత వ్యక్తం చేయగా, జనగణనతోపాటు కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ వస్తున్నది. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కులగణనకు జై కొడుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన పొలిటికల్ అఫైర్స్ కేబినెట్ కమిటీ సమావేశంలో కులగణనపై నిర్ణయం తీసుకోగా, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. జనగణనతోపాటే కులగణన చేస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర నిర్ణయంతో కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ కౌంటర్ ఎటాక్
కులగణనపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూనే రాహుల్ గాంధీ కృషి వల్లే ఇది జరిగిందని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్, జనం బాధలను దగ్గరుండి చూశారని, అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో కులగణన చేపట్టాలని తాము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అంతేకాదు, కులగణన విషయంలో తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే, కాంగ్రెస్ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారనేది బీజేపీ వాదన. స్వాతంత్ర్య భారతంలో ఇప్పటిదాకా కులగణన జరగలేదని, దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. 2011 జనగణన సమయంలో కులగణనను చేర్చాలని సుష్మా స్వరాజ్ అప్పటి ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, తెలంగాణలో జరిగిన కులగణన తూతూమంత్రంగా జరిగిందని విమర్శలు చేస్తున్నారు. ఇదేదో తమ విజయంగా కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 60 ఏళ్లపాటు ఎందుకు చేయలేదని కాషాయ నేతలు కడిగిపారేస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మాటల యుద్ధంతో కులగణన అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
Read Also- Maoists: నక్సల్స్‌తో శాంతి చర్చలు.. 2004లో ఏం జరిగింది? ఈసారి ఏం చేయాలి?