Kuppam Municipal Chairman: గత కొన్ని రోజులుగా ఆసక్తిరేపుతున్న కుప్పం మున్సిపల్ ఛైర్మన్ కుర్చీ.. టీడీపీ (TDP) ఖాతాలో చేరింది. వైసీపీ (YSRCP)కి షాక్ ఇస్తూ నలుగురు కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో బలం లేకపోయినా చైర్మన్ కుర్చీ.. టీడీపీ గెలుచుకుంది. దీంతో టీడీపీకి చెందిన 5వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజు (Selvaraju).. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీంతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం (Kuppam MPDO Office)లో టీడీపీ శ్రేణులు (TDP Cadre) సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాగా.. ఆయన చాణిక్యంతోనే ఛైర్మన్ పదవి సొంతం చేసుకున్నట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.
వైసీపీకే బలం.. కానీ
చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి పెద్దగా బలం లేదు. దీంతో తమ అభ్యర్థిని ఛైర్మన్ గా గెలిపించుకొని.. సీఎం చంద్రబాబుకు గట్టి ఝలక్ ఇవ్వాలని వైసీపీ భావించింది. కుప్పం మున్సిపాలిటీలో మెుత్తం 24మంది కౌన్సిలర్లుగా ఉండగా అందులో 14మంది వైసీపీకి చెందిన వారే ఉన్నారు. మిగిలిన 10మంది టీడీపీ వారు. వాస్తవానికి తొలుత ఆరుగురు కౌన్సిలర్లే టీడీపీకి ఉండగా.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన నలుగురు తెలుగుదేశంలోకి జంప్ అయ్యారు. దీంతో ఆ పార్టీ బలం 10కి చేరింది. స్థానిక ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ వారు కావడంతో.. ఎక్స్ అఫిషియో సభ్యుల కింద వైసీపీ ఓటు బలం మరో 2 పెరిగి 16 చేరింది. అటు సీఎం చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే కావడంతో ఆయన ఎక్స్ అఫిషియో ఆయన ఎక్స్ అఫిషియో ఓటు కలుపుకొని మెుత్తం 27 ఓట్లు.. ఛైర్మన్ ఎంపికకు ఉన్నాయి.
Also Read: Kaleshwaram project: ఒక్క ప్రసంగం.. 100 ప్రశ్నలు.. కేసీఆర్ కు కొత్త చిక్కులు!
మ్యాజిక్ చేసిన టీడీపీ
ఛైర్మన్ ఎంపికలో కీలకమైన 27 ఓట్లలో సగంకి పైగా అంటే 14 ఓట్లు వచ్చిన పార్టీ అభ్యర్థికి చైర్మన్ పదవి దక్కుతుంది. ఆ లెక్కన వైసీపీ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా వైసీపీలో మరో నలుగురు కౌన్సిలర్లు.. ఛైర్మన్ ఎన్నికలో టీడీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో 10గా ఉన్న ఆ పార్టీ ఓట్ల బలం.. 14కు చేరింది. తద్వారా కుప్పం మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ వశమైంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడం, పైగా టీడీపీ బలం తక్కువగా ఉండటంతో కుప్పంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలను కుదిపిసేంది. ఈ క్రమంలో టీడీపీ సీటును దక్కించుకోవడంతో తెలుగు తమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.