Kaleshwaram project: తెలంగాణను పదేళ్లపాటు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ (BRS Party).. ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. పార్టీని స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR).. వరంగల్ లోని ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ (BRS Silver Jubilee Meeting)ను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైందంటూ నిందించారు. అయితే తన హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleswaram Project) పై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాళేశ్వరం వివాదం
నీళ్లు, నిధులు, నియామకాలు అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం (Telnagana State) ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అనే లక్ష్యాన్ని చేరుకున్నట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. అయితే కట్టిన మూడేళ్లకే మేడిగడ్డ (Medigadda) వద్ద ప్రాజెక్ట్ కుంగిపోవడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఎలాంటి ప్రణాళిక లేకుండా హడావీడిగా ప్రాజెక్ట్ నిర్మించి.. కేసీఆర్ ఫ్యామిలీ (KCR Family) తమ ముడుపుల కోసం కాళేశ్వరాన్ని బలి చేసిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే నిపుణుల కమిటీని సైతం వేసి దర్యాప్తు చేయిస్తోంది. ప్రాజెక్ట్ కు ఎంతో కీలకమైన డీపీఆర్ ఆమోదం పొందకముందే కాళేశ్వరాన్ని నిర్మించారంటూ తాజాగా కమిటీ తేల్చింది.
కేసీఆర్ మౌనం
కాళేశ్వరం నిర్మాణంలో గత ప్రభుత్వ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నిపుణుల కమిటీ విచారణ కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యులైన ఇంజనీర్లు సైతం నిర్లక్ష్యంగా వ్వహరించారంటూ ఆరోపణలు ఉన్నాయి. డీపీఆర్ ఆమోదం లేదని తేలడంతో ఒక్కసారిగా కాళేశ్వరం అంశం రాజకీయంగా మారోమారు చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా రజతోత్సవ సభలో కేసీఆర్ కాళేశ్వరంపై గట్టి కౌంటరే ఇస్తారని అధికార కాంగ్రెస్ తో పాటు విపక్ష బీజేపీ భావించింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సమర్థించుకుంటూ నిపుణుల కమిటీపై విమర్శలు చేస్తారని అంచనా వేశారు. తీరా చూస్తే ఒక్కమాట కూడా కాళేశ్వరం లేకపోవడం రెండు పార్టీల నేతలను ఆశ్చర్యపరుస్తోంది.
అందుకే మాట్లాడలేదా?
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం.. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ నిర్మాణంలో గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రోజుకొకటి బయటపడుతున్న క్రమంలో.. ఏం మాట్లిడితే ఏమి వస్తుందోనని కేసీఆర్ భయపడి ఉంటారని కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కాళేశ్వరంపై రోజుకో బయటకు వస్తున్న క్రమంలో మళ్లీ దానిపై మాట్లాడి వివాదాన్ని ఇంకాస్త పెంచడం ఎందుకని కేసీఆర్ అభిప్రాయపడి ఉంటారని అంచనా వేస్తున్నారు.
మహిళలను చులకన చేశారా?
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను సభలో మాట్లాడిన కేసీఆర్.. మహిళలకు ఉచిత స్కూటీ పథకం గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పై అసహనాన్ని వ్యక్తపరిచే క్రమంలో కేసీఆర్ మాట జారారు. ‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆడ పొరగాళ్ళకు స్కూటీ ఇస్తా అని ఇచ్చిందా?’ అంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారడంతో కేసీఆర్ ను మహిళలు తప్పుబడుతున్నారు. మహిళల పట్ల ఆయన అగౌరవంగా మాట్లాడారని మండిపతున్నారు. వెంటనే మహిళలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ విషయంలోనూ
రజతోత్సవ సభ ప్రసంగంలో పదే పదే కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన కేసీఆర్.. బీజేపీని మాత్రం కాస్త సుతిమెత్తంగా విమర్శించారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎప్పుడు సభ పెట్టిన.. బీజేపీ, కాంగ్రెస్ పై చెరిసమానంగా విరుచుకుపడే కేసీఆర్.. ఈసారి బీజేపీ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారన్న చర్చ మెుదలైంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో మెుదలయ్యాయి.