Government Lands Grabbing: హైటెక్ నియోజకవర్గంగా పేరుగాంచిన శేరిలింగంపల్లి మండలంలో ప్రభుత్వ భూములు కబ్జాలు గురవుతూనే ఉన్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఇప్పటికే కబ్జాలకు గురవ్వగా.. ఉన్న భూములను కాపాడుకోవడంలో అధికార యంత్రాంగం విఫలం అవుతోంది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ సర్వే నెంబర్ 100, 101 లో 551 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
వీటిపై చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. 2003వ సంవత్సరంలో హైకోర్టు ఈ భూములు ప్రభుత్వానివేనంటూ తీర్పు ఇచ్చింది. కానీ కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆ భూములు తమవే నంటూ సుప్రీంకోర్టులో దావా వేశారు. ఈ భూములపై సుప్రీం కోర్టు స్టేటస్ కొనసాగుతోంది. ఈ భూములపై కొన్నాళ్ల క్రితం పేదలు గొడవలు చేశారు. ఈ గొడవల్లో ఏకంగా పోలీసులపై రాళ్లు రువ్వారు.
ఈ నేపథ్యంలో హెచ్ ఎండీఏ అధికారులు కోట్ల రూపాయలు ఖర్చుచేసి కబ్జాలకు గురైన భూములు వదిలేసి మిగిలిన భూములకు కంచె వేయించారు. ఈ భూముల రక్షణకు ఎస్టేట్ ఆఫీసర్, హెచ్ ఎండీఏ తహశీల్దార్, సెక్యూరిటీ సిబ్బందిని ప్రభుత్వం నియమించి ఆక్రమణలు జరగకుండా చూసుకునే బాధ్యతలు అప్పగించింది.
భూముల రక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ, పట్టపగలే ఫెన్సింగ్ ను తొలగించి సర్వే నెంబర్ 100, 101లో ఉన్న భూముల్లో తిష్టవేసేందుకు కబ్జాదారులు ప్రయత్నించారు. శుక్రవారం కొందరు వ్యక్తులు జేసీబీ సహాయంతో సర్వే నెంబర్ 100లో వేసిన ఫెన్సింగ్ ను తొలగించి అక్కడ స్థలాన్ని కబ్జా చేసేందుకు పూనుకున్నారు.
Also read: Private Bankers Fraud: పల్లెల్లోకి చేరుకున్న కేటుగాళ్లు.. బ్యాంకు లోన్లు అంటూ మోసం!
కొందరు పక్కనే ఉండి సూచనలు చేస్తుండగా మరికొంతమంది దగ్గరుండి స్థలాన్ని చదును చేయించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే ఆక్రమణదారులు అక్కడి నుంచి మిషనరీని పంపించి వేశారు. విషయం తెలుసుకున్న హెచ్ ఎండీఏ అధికారులు సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.
కబ్జాలకు యత్నించిన వారిపై మియాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మియాపూర్ పోలీసులు వెంకటేశ్వర రావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలో భూముల ఫెన్సింగ్ తొలగించి కబ్జాకు యత్నించిన వారిపై మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని హెచ్ఎండీఏ తహశీల్దార్ దివ్య తెలిపారు.
కేసు నమోదు అయినట్లు చెప్పారు. అయితే ఒకరిపై కేసు నమోదు చేసి మిగతా వారిపై ఎందుకు కేసు పెట్టలేదు అనేదానిపై తహశీల్దార్ స్పందించలేరు. అలాగే జేసీబీని వదిలివేయడంపై కూడా అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు హెచ్ ఎండీఏ అధికారుల సహకారంతోనే ఇదంతా జరుగుతుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.