Bar Staff Arrested: ప్రస్తుత రోజుల్లో పప్పు నుంచి ఉప్పు దాకా ప్రతీది కల్తీమయంగా మారిపోతోంది. కారం, పసుపు, పాలు, పెరుగు, అల్లం, బెల్లం ఇలా.. ఒకటేమిటీ అన్నింటా కల్తీ వస్తువులను నిత్యం చూస్తునే ఉన్నాం. చివరికీ టాప్ బ్రాండ్ మద్యాన్ని సైతం కొందరు ప్రబుద్దులు కల్తీ చేస్తున్నారు. అలాంటి వారిని హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లింగంపల్లి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సోసైటీలో ట్రూప్స్ బార్‌ను రెన్యూవల్ చేయలేదు. ఫీజు కూడా చెల్లించకపోవడంతో రంగారెడ్డి ఏఈఎస్ జీవన్ కిరణ్.. తన ఎక్సైజ్ సిబ్బందితో కలిసి బార్ కు వెళ్లారు. బార్‌లో ఖరీదైన మద్యం బాటిళ్ల సీల్ తీసి.. నాసిరకం మద్యాన్ని కలుపుతున్నట్లు గుర్తించారు. ఈ కల్తీ మోసానికి పాల్పడుతున్న కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ, పునిక్ పట్నాయక్ రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. రూ. 2690 ధర కలిగిన జెమ్‌సన్ బాటిల్స్ లో రూ.1000 ధర కలిగిన ఓక్స్‌మిత్ మద్యాన్ని కలుపుతుండగా పట్టుకున్నట్లు.. అధికారులు తెలిపారు.
75 బాటిళ్లు సీజ్
బార్ లో కల్తీ చేసిన 75 బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 55 ఖాళీ మద్యం బాటిళ్లను గుర్తించారు. గత కొంత కాలంగా ట్రూప్ బార్ లైసన్స్ ఫీజ్ చెల్లించలేదని, దీనికి తోడు మద్యం డిపోల నుంచి మద్యం తీసుకోవడం లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అనుమానం వచ్చి బార్ లో తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఇతర మద్యం దుకాణాల్లో మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి ఎక్కువ ధరలు కలిగిన బాటిళ్లలో వాటిని కలిపి అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా భారీగా లాభాలు గడిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు.
రూ.1.48 లక్షల మద్యం
మెుత్తంగా బార్ నుంచి రూ.1.48 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. బార్ లైసన్స్ ఓనర్ ఉద్యాకుమార్ రెడ్డి, మేనేజర్ వి. సత్యనారాయణ రెడ్డి, బార్ ఉద్యోగి పునిత్ పట్నాయక్‌లపై కేసు నమోదు చేసి లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు ఏఈఎస్ జీవన్ కిరణ్ వెల్లడించారు. కల్తీ మద్యాన్ని పట్టుకున్న వారిలో సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సిబ్బంది ఉన్నారు. వారందని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి. కమల్ హాసన్‌రెడ్డి, డిప్యూటి కమిషనర్ పి. దశరథ్, అసిస్టేంట్ కమిషనర్ ఆర్. కిషన్‌లు అభినందించారు.
Also Read: Bar Staff Arrested: మందుబాబులారా జాగ్రత్త.. టాప్ బ్రాండ్స్ లోనూ కల్తీ.. ఆదమరిస్తే చిత్తే!
కల్తీ మద్యంతో జాగ్రత్త!
సాధారణంగా మద్యం సేవిస్తేనే ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచిస్తుంటారు. అది ఆరోగ్యాన్ని క్షణ క్షణం క్షీణించేలా చేస్తుందని చెబుతుంటారు. అలాంటిది కల్తీ మద్యం తాగితే ఇక మీ ప్రాణాలు దేవుడే కాపాడాలని నిపుణులు సూచిస్తున్నారు. మద్యం సేవించడం తప్పే కానీ.. నాణ్యమైన లిక్కర్ తీసుకోవడం మరీ ముఖ్యమని చెబుతున్నారు. కాబట్టి మద్యం సేవించే వారు.. కల్తీ రకం లిక్కర్ పై జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.