AIMIM Wins In Elections: హైదరాబాద్ నగరంలో హోరాహోరీగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసి పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. శుక్రవారం కౌంటింగ్ నిర్వహించగా ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ కు 63 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. ఎట్టకేలకు ఎంఐఎం అభ్యర్థి విజయాన్ని అందుకున్నారు.
ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే శుక్రవారం ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో కౌంటింగ్ ప్రారంభం కాగా, మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయని అధికారులు ధృవీకరించారు. ఈ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు సభ్యులు పాల్గొనగా, ఓటింగ్‌కు దూరంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు.
Also Read: Uppal Balu: వారందరూ నా బ్యాగ్ మోసినవాళ్లే.. ఉప్పల్ బాలు కామెంట్స్
ఈ ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా భావించి విస్తృత ప్రచారం నిర్వహించింది. అంతేకాకుండా పలు ప్లెక్సీలను ఏర్పాటు చేసి ఎంఐఎం కు ఓట్లు వేయవద్దని కొందరు ఓటర్లను కోరారు. అయితే ఈ ఎన్నికను ఎంఐఎం ఛాలెంజ్ గా తీసుకొని చివరకు విజయాన్ని అందుకోవడంతో, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. కాగా హైదరాబాద్ పోలీసులు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో తమ మార్క్ చూపించారు. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఘటన జరగకుండా, పోలీసులు పక్కా ప్లాన్ తో ఎన్నిక శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవడంతో స్థానిక ప్రజలు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.