Pahalgam’s Tourism: పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత టూరిజం పూర్తిగా పడిపోయింది. ప్రస్తుతం పెహల్గాం, గుల్మార్గ్, సోన్ మార్గ్‌లో ఎక్కడా టూరిస్టులు కనిపించట్లేదు. ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడే కశ్మీర్.. ఉగ్రదాడి తర్వాత నిర్మానుష్యంగా మారి, ఖాళీగా కనిపిస్తూ బోసిపోయింది. పచ్చని కశ్మీర్ అందాలను చూడడానికి ఎవరూ రావడం లేదు.
హోటళ్లు ఖాళీ చేసి హుటాహుటిన స్వస్థలాలకు వెళ్ళిపోయారు చాలా మంది టూరిస్టులు. సమ్మర్‌లో కశ్మీర్ టూర్ కోసం ప్లాన్ చేసుకున్నవాళ్ళు సైతం టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఉగ్రవాదుల వల్ల తమ ఆదాయం పడిపోయిందని, తమకు బతికే మార్గం లేదని స్థానికుల ఆవేదన చెందుతున్నారు.
కశ్మీర్.. నిన్నటి వరకు ఓ భూతల స్వర్గం.. ఇప్పుడో కల్లోల ప్రాంతం. నిన్నటి వరకు పర్యాటకులతో కిటకిటలాడిన ప్రాంతాలన్ని ఇప్పుడు నిర్మానుష్యంగా మారాయి. పర్యాటకుల ఊసే లేదు. ఉగ్రవాదుల పేల్చిన తుపాకుల శబ్ధాలు ఇప్పుడప్పుడే మర్చిపోయే పరిస్థితి కనిపించడం లేదు. అక్కడ ఏరులై పారిన పర్యాటకుల రక్తపు వాసన ఇప్పుడప్పుడే మరుగున పడే అవకాశం కనిపించడం లేదు.
ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం మాములుది కాదు. ఏకంగా 26 మందిని అత్యంత దారుణంగా హతమార్చారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ సౌదీ నుంచి హుటాహుటిన తిరిగొచ్చారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే కేంద్రహోంమంత్రి అమిత్ షా కశ్మీర్‌లో ల్యాండ్ అయ్యారు. ఎప్పుడైతే ఈ ఉగ్రదాడి జరిగిందో అప్పటి నుంచి వేగంగా మారాయి పరిస్థితులు. అంతే వేగంగా దెబ్బతిన్నాయి భారత్ -పాక్ సంబంధాలు. పెహల్గాం ఉగ్రవాదులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
Also read: Pahalgam attackers: ఆర్మీ ట్రాప్ లో ఉగ్రవాదులు.. ఇక వారికి మూడినట్లే!
ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నా, వేటాడుతామని హెచ్చరించారు. వారికి కలలో కూడా ఊహించని శిక్ష వేస్తామన్నారు. ఉగ్రవాదులే కాదు, వారికి ఆశ్రయమిస్తున్న వారిని సైతం విడిచిపెట్టబోమన్నారు ప్రధాని మోడీ.
మోడీ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతికి వివరించారు. అంతేకాదు వివిధ దేశాల రాయబారులతో కూడా సమావేశం కానుంది ప్రభుత్వం. రేపు ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. మరోవైపు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది కేంద్రం. ఈ భేటీ తర్వాత కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం క్లియర్‌కట్‌గా కనిపిస్తోంది.
ఓవరాల్‌గా చూస్తే సర్జికల్ స్ట్రైక్‌ను మించిన యాక్షన్ జరగబోతోందనిపిస్తోంది. ప్రధాని మోడీ మాస్ వార్నింగ్.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. ఉగ్రవాదుల్ని చంపేయడం కాదు.. ముష్కరుల మూలాల్ని నాశనం చేయడంపైనే ఫోకస్ పెట్టేలా కనిపిస్తోంది.
నిజానికి కేంద్రం ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేదే పాక్‌కు ఓ చావు దెబ్బ అని చెప్పాలి. పాక్‌కు ఇప్పటికిప్పుడు దీని ఎఫెక్ట్ తెలియకపోయినా.. రాను రాను రోజుల్లో ఈ ఎఫెక్ట్ గట్టిగా పడేఅవకాశం ఉంది. ఎందుకంటే ఆ నిర్ణయంతో పాకిస్తాన్ ఎడారిలా మారుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ కేంద్రం చర్యలు చూస్తుంటే అంతకుమించి అనేలా మోడీ చర్యలు ఉండబోతున్నాయనిపిస్తోంది.