Pahalgam attackers: కాశ్మీర్ లో దాడికి తెగబడ్డ ముష్కరులను కఠినంగా శిక్షించాలని యావత్ దేశం కోరుకుంటోంది. అమాయకులైన హిందువులను మతం అడిగి మరి మట్టుబెట్టిన వారిని దారుణంగా శిక్షించాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దాడి అనంతరం కొండల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. అడుగడుగునా గాలిస్తూ ముష్కర మూకను తుదిముట్టించేందుకు బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.
నజరానా ప్రకటన
జమ్ముకాశ్మీర్ పహల్గాంలో ఐదాగురు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. దాడిలో పాల్గొన్న వారిలో ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూతల్హాగా పోలీసులు గుర్తించారు. లష్కరే తాయిబా అనుబంధ గ్రూపు రెసిస్టెన్స్ ఫ్రంట్ చెందిన సభ్యులుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఐదారుగురు ఉగ్రమూకపై జమ్ముకాశ్మీర్ పోలీసులు భారీ నజరానా ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని పట్టుకొని తీరాలన్న ఉద్దేశ్యంతో రూ.20 లక్షల బహుమతి ప్రకటించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఉపయోగపడే సమాచారం ఇస్తే దీనిని అందజేస్తామని ప్రకటించారు.
పక్కా ప్లాన్ ప్రకారమే..
కాల్పులకు తెగబడిన ముష్కర మూకలు స్థానికులం అని నమ్మించే వేషదారణలో వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా సైనిక దుస్తులు, కుర్తా పైజామా ధరించి దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి చేశారని భద్రతా బలగాలు చెబుతున్నాయి. దాడికి కొన్ని రోజుల ముందే ముష్కర మూకలు కాశ్మీర్ లో అడుగుపెట్టాయని పేర్కొంటున్నాయి. పరిసరాలను పూర్తిగా సమీక్షించుకొని ఫైనల్ గా పహల్గాంలోని టూరిస్ట్ ప్రాంతాన్ని వారు ఎంచుకున్నట్లు సమాచారం. చెట్లమాటున నక్కి.. కాల్పులు జరపవచ్చని.. ఆపై వెంటనే చెట్ల గుండా అడవిలోకి పారిపోవచ్చని వారు ముందే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తప్పించుకునే మార్గాన్ని కూడా నిర్దేశించికున్న తర్వాతే ఐదారుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
Also Read: High Alert In Telangana: రాష్ట్రంలో హై అలర్ట్.. డీజీపీ కీలక సూచనలు.. రంగంలోకి పోలీసులు!
నిమిషాల వ్యవధిలోనే..
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో అమాయకులు ప్రాణం తీసేందుకు చాలా సమయమే ఉగ్రవాదులు తీసుకున్నారన్న అనుమానం అందరిలో సహజంగానే కలిగింది. అయితే ముష్కరులు 10 నిమిషాల వ్యవధిలోనే కాల్పుల ప్రక్రియను ముగించినట్లు సమాచారం. ఐదారుగురు ఉగ్రవాదులు ఏకే 47 తుపాకులతో వచ్చి తొలి తూటాను మధ్యాహ్నం 1:50 గంటలకు పేల్చినట్లు తెలుస్తోంది. మ.2 గంటలు అయ్యేసరికి కాల్పులు ముగించుకొని అడవిలోకి పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ముష్కరులను వెంటాడుతూ వెళ్లిన భద్రతా బలగాలు.. ఏ క్షణమైనా వారిని మట్టుబెట్టే అవకాశముందని తెలుస్తోంది.