YCP Vidadala Rajini: మాజీ మంత్రి, వైసీపీ కీలక మహిళా నేత విడదల రజనీని కూటమి ప్రభుత్వంలో కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అరెస్ట్ ఖాయమంటూ గత కొన్నిరోజులుగా ఏపీలో ప్రచారం జరుగుతోంది. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో రజనీతో పాటు ఆమె మరిది పేరును కూడా చేర్చారు. ఈ కేసుపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మరిది విడదల గోపి (Vidadala Gopi)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
గచ్చిబౌలిలో అరెస్ట్
వైసీపీకి చెందిన ఏపీ మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తొలుత ఆయన్ను స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా విజయవాడకు తీసుకెళ్తున్నారు. విజయవాడలోని తమ కార్యాలయానికి తీసుకెళ్లి విడదల గోపిని ప్రశ్నించే అవకాశముంది.
కేసు వివరాలు ఇలా..
గత ప్రభుత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన రజనీ.. ఆపై వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని యడ్లపాడుకు చెందిన స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడు ఫిర్యాదు మేరకు ఏసీపీ అధికారులు కేసు నమోదు చేశారు. విడదల రజనీతో పాటు ఆమె మరిది గోపి, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా, రజినీ పీఏ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు.
హైకోర్ట్ కు వెళ్లిన రజనీ
అయితే ఈ కేసులో అరెస్ట్ కాకుండా రక్షణ పొందేందుకు విడదల రజనీ, ఆమె మరిది ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అటు నిందితుడిగా విజిలెన్స్ అధికారి జాషువా సైతం న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. ఎలాంటి తీర్పు వెలువరించలేదు. తీర్పును రిజర్వ్ మాత్రమే చేసింది. దీంతో తాజాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న రజనీ మరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Gold Rate Today : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన గోల్డ్ రేట్స్..
నెక్ట్స్ రజనీ అరెస్ట్?
ఈ కేసులో ఏ2గా ఉన్న రజనీ మరిదిని అరెస్ట్ చేయడంతో త్వరలో మాజీ మంత్రిని సైతం అరెస్ట్ చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఆమె మరిది విడదల గోపి నుంచి కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఉన్నారు. రజనీ గతంలో మంత్రిగా చేయడంతో పాటు.. వైసీపీ కీలక మహిళా నేతగా వ్యవహరిస్తుండటంతో పక్కా ఆధారాలను సేకరించిన తర్వాతే ఆమెను అదుపులోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కావాల్సిన కపక్కా ఆధారాలను మరిది ద్వారా సేకరించి త్వరలోనే ఆమెను అరెస్ట్ చేయడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.