Weather Update: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు విపరీతంగా వీచే అవకాశాలున్నట్లు భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
ఇందులో దక్షిణ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, విదర్భ ప్రాంతాలు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ 25 వరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.
మరో వైపు దేశ రాజధాని ఢిల్లీలో 4 నుంచి 5 రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది.
గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం ఉంటుందని IMD తెలిపింది. ఏప్రిల్ 25 వరకు వేడి, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశాలున్నాయని తెలిపింది.
అయితే, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ఎదురుగాలు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ పిడుగుల పడే ఛాన్స్ ఉందని చెప్పింది.
మరోవైపు ఇటీవలే వ్యవసాయ రంగానికి తీపి కబురు చెప్పింది భారత వాతావరణ విభాగం (ఐఎండీ). ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్-సెప్టెంబరు) దేశ వ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని ప్రటించింది.
Also read: Visakha Man Died In Attack: మొక్కలకు నీళ్లు పోసి.. కాశ్మీర్ దాడిలో ప్రాణం వదిలి.. విశాఖలో విషాదం
1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, ఇప్పుడు అందులో 105% దాకా వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. అలాగే సాధారణానికి మించి, అధిక వర్షపాత అంచనాలను కలిపి చూస్తే 56% మంచి వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. అలానే ఈ ఏడాదిలో ఎల్నినో ఏర్పడే పరిస్థితులు లేవని వివరించింది.
డిసెంబరు-మార్చి మధ్య హిమాలయాలు, యూరో ఏసియా ప్రాంతంలో మంచు తక్కువగా ఉందని, ఇవన్నీ మంచి వర్షాలు కురిసేందుకు శుభపరిణామాలని IMD తెలిపింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, బిహార్ లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.