Pope Francis dies: క్యాథలిక్ మతపెద్ద అయిన పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ సిటీ (Vatican City) అధికారికంగా ప్రకటించింది. 88 ఏళ్ల వయసున్న పోప్ ఫ్రాన్సిస్.. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాటికన్ సిటీలోని తన నివాసంలో కొద్దిసేపటి క్రితం ఆయన ప్రాణాలు విడిచారు. ఆదివారం జరిగిన ఈస్టర్ వేడుకల్లోనూ పోప్ పాల్గొన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు.
Also Read: KPHB Crime: భర్తపై విరక్తి.. షాకిచ్చి చంపిన భార్య.. హైదరాబాద్ లో దారుణం
ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్ర అనారోగ్యానికి గురైన పోప్ ఫ్రోన్సిస్.. రోమ్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. దీంతో తమకు దైవ సమానులైన పోప్ కోలుకోవాలని క్యాథలిక్ అనుసరించే వారంతా ప్రార్థిస్తూ వస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా బయటకి రావాలని గత కొన్ని రోజులుగా ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరణించినట్లు వార్త బయటకు రావడంతో.. క్యాథలిక్ సమాజం తీవ్ర శోకసంద్రంలో మునిగి పోయింది.
పోప్ మరణవార్తపై ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్పందించారు. ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని పోస్ట్ పెట్టారు. పోప్ ఫ్రాన్సిస్ మరణవార్త తనను ఎంతో బాధించిందని ప్రధాని అన్నారు. విషాదంలో మునిగిన ప్రపంచ కాథలిక్ సమాజానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నట్లు చెప్పారు. భారత ప్రజలపట్ల పోప్ కు ఉన్న ప్రేమ ఎల్లపుడూ తనకు గుర్తుంటుందని అన్నారు. ఈ మేరకు గతంలో పోప్ తో దిగిన ఫొటోలను ప్రధాని పంచుకున్నారు.
టోక్యో శాంతి దూతగా ప్రపంచంపై పోప్ ఫ్రాన్సిస్ చెరగని ముద్ర వేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్ మరణంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ తన జీవితాన్ని చర్చి, మానవ సేవకు అంకితం చేశారని, శరణార్ధులకు మద్దతుగా నిలిచారని సీఎం కొనియాడారు. సామాజిక న్యాయం, మత సామరస్యం పెంపునకు ఆయన అవిశ్రాంతంగా శ్రమించారని పేర్కొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం మానవాళికి తీరని లోటు అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేథలిక్ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతిని తెలియజేశారు.