Liquor Shops Closed: హైదరాబాద్ లోని మందుబాబులకు భారీ షాక్ తగిలింది. ఏకంగా నాలుగు రోజుల పాటు మద్యంపై నిషేధం విధించారు. దీంతో ఆయా రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదు. ఒకవేళ కొనుగోలు చేయాలని అక్రమ మార్గాలు ఎంచుకుంటే వారిపై కఠిన చర్యలు సైతం పోలీసులు తీసుకోనున్నారు. ఇంతకీ మద్యంపై నిషేధం ఎందుకు? ఏ రోజుల్లో మద్యం అందుబాటులో ఉండదు? వంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చూద్దాం.
ఎన్నికల నేపథ్యంలో
హైదరాబాద్ పరిధిలో ఈనెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ మద్యంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఎన్నికలు జరిగే రోజైన బుధవారం సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. అలాగే కౌంటింగ్ జరిగే 25తేదీ రోజున సైతం వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ క్లోజ్ చేయాలని సీపీ సూచించారు. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకూ ఈ నిషేదం ఉండనుంది.
కఠిన చర్యలు
మద్యంపై నిషేదాన్ని ఉల్లంఘించి ఎవరైనా క్రయ విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర సీపీ సీవీ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. వైన్ షాపు అనుమతులను సైతం రద్దు చేస్తామని హెచ్చరించారు. షాపుల్లో కాకుండా మరో మార్గంలో మద్యాన్ని విక్రయించినా కూడా నేరంగా పరిగణించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరూ పోలీసు ఆదేశాలను పాటించి.. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు.
Also Read: Money Earning Tips: ఆన్ లైన్ లో నెలకు రూ.20,000 సంపాదించాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
పోలింగ్ కు ముమ్మర ఏర్పాట్లు
మరోవైపు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఈసీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయాలని ఈసీ భావిస్తోంది. ఓటర్లందరికీ ఒకటి నుంచి 112 వరకు వరుస సంఖ్యలను కేటాయించి, పోలింగ్ బూత్ నెం.1లో ఓటరు క్రమ సంఖ్య నెంబర్ 1 నుంచి 56 వరకు, అలాగే ఓటరు వరుస సంఖ్య నెంబర్ 57 నుంచి 112 వరకు పోలింగ్ బూత్-2 లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, ముందు జాగ్రత్తగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి ఇప్పటికే ఎలక్షన్ స్టాఫ్ కు రెండో విడత ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ముగించారు.