MLC Local body elections: హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. జీహెచ్ ఎంసీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాధారణంగా ఈ స్థానం ఎపుడు ఖాళీ అయినా అధికార పార్టీ, మజ్లీస్ పార్టీలు అవగాహన ఒప్పందంతో ఏకగ్రీవంగా ఎన్నిక ముగిసేది. కానీ ఈ సారి బీజేపీ, మజ్లీస్ పార్టీలు ఎన్నికల బరిలో నిల్చుండటంతో పోలింగ్ అనివార్యమైంది.
రెండే పోలింగ్ బూత్ లు
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయాలని ఈసీ భావిస్తోంది. ఓటర్లందరికీ ఒకటి నుంచి 112 వరకు వరుస సంఖ్యలను కేటాయించి, పోలింగ్ బూత్ నెం.1లో ఓటరు క్రమ సంఖ్య నెంబర్ 1 నుంచి 56 వరకు, అలాగే ఓటరు వరుస సంఖ్య నెంబర్ 57 నుంచి 112 వరకు పోలింగ్ బూత్-2 లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, ముందు జాగ్రత్తగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి ఇప్పటికే ఎలక్షన్ స్టాఫ్ కు రెండో విడత ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని కూడా ముగించారు.
25న ఓట్ల లెక్కింపు
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అండర్ గ్రౌండ్ లో ప్రస్తుతం కంట్రోల్ రూమ్ కు వినియోగిస్తున్న ఫేస్ టు ఫేస్ హాల్ ను పోలింగ్ బూత్ నెం.1గా ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో గతంలో లైబ్రరీ కోసం వినియోగించిన హాల్ లో పోలింగ్ బూత్ నెం.2 ను ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. బ్యాలెట్ పేపర్ తో నిర్వహించనున్న ఈ ఎన్నికకు సంబంధించి ఈ రెండు పోలింగ్ బూత్ లలోనే బ్యాలెట్ బాక్స్ లను భద్రపర్చనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత 25వ తేదీన పన్వర్ హాల్ లోనే ఓట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఓటింగ్ కు బీఆర్ఎస్ దూరం
జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 23న జరగనున్న పోలింగ్ కు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు చెందిన 24 మంది ఓటర్లు దూరంగా ఉండనున్నట్లు తెలిసింది. 112 మంది ఓటర్లలో అత్యధికంగా 49 మంది ఓటర్లు మజ్లీస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ మద్దతు తెలపడంతో ఆ స్థానంలో మజ్లీస్ అభ్యర్థి గెలిచారు. ఈ దఫా అధికార కాంగ్రెస్ మజ్లీస్ అభ్యర్థికి అండగా ఉండటంతో గెలుపు దాదాపుగా ఏకగ్రీవమైంది. దీంతో ఓటు వేసినా ప్రయోజనం ఉండదని భావించి బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నిలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.
Also Read: CM Revanth: అభివృద్ధిలో ప్రపంచంతోనే పోటీ.. టార్గెట్ చెప్పేసిన సీఎం
మ్యాజిక్ ఫిగర్ ఎంతంటే?
కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు కేటీఆర్ సైతం దూరంగా ఉండనున్నారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి, ఓటింగ్ లో పాల్గొనే వారిపై చర్యలు తప్పవని కూడా కేటీఆర్ అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది. కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచేందుకు మ్యాజిక్ ఫిగర్ 57గా ఉంది. మజ్లీస్ కున్న ఓటర్ల సంఖ్య 49కి కాంగ్రేస్ కున్న ఓటర్లు 14 మంది తోడు కావడంతో మజ్లీస్ బలం 63 చేరుతుంది. దీంతో మజ్లీస్ అభ్యర్థి గెలిచే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.