Vikarabad district: ప్రస్తుత రోజుల్లో మెుబైల్ ఫోన్ ప్రతీ ఒక్కరికీ అత్యవసరంగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లాలన్న, ఏ పని చేయాలన్న చేతిలో మెుబైల్ ఫోన్ ఉండాల్సిందే. సెల్ ఫోన్.. ఒక క్షణం కనిపించకపోయినా కొందరు విలవిలలాడిపోతుంటారు. ఏ క్షణంలో ఏ ఉపద్రవం వస్తుందో అన్నట్లుగా ఎప్పుడు మెుబైల్ ను ఛార్జ్ చేస్తూనే ఉంటారు. రైల్వే స్టేషన్, బస్ స్టాప్ లలో ఈ తరహా వ్యక్తులను చూస్తూనే ఉంటాం. ఇదిలా ఉంటే ఓ గ్రామంలో తలెత్తిన విద్యుత్ సంక్షోభం.. మెుబైల్ యూజర్లను చిక్కుల్లో పడేసింది. దీంతో వారు చేసిన పని ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఏం జరిగిందంటే?
శుక్రవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ చెట్లు, కరెంటు స్థంబాలు పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే రెండ్రోజుల క్రితం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా విద్యుత్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. ఫలితంగా గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తట్టేపల్లి గ్రామంలో విద్యుత్ సంక్షోభం.. మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఎగబడిన జనం
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లిలో ఈదురు గాలులతో విద్యుత్ వైర్లు తెగడంతో రెండు రోజులుగా కరెంటు అంతరాయం. త్రాగునీటి ఇబ్బందులతో యువకులు చందాలతో డీజిల్ జనరేటర్ తెచ్చి, బోర్లు, మొబైల్… pic.twitter.com/2IDAy0HI8e
— ChotaNews App (@ChotaNewsApp) April 19, 2025
ఛార్జింగ్ కోసం ఎగబడ్డ జనం
విద్యుత్ సరఫరా లేకపోవడంతో మోటర్లు పనిచేయక నీటి సమస్య తలెత్తింది. ఇది గమనించిన గ్రామంలోని యువకులు… చందాలు వేసుకొని డీజిల్ జనరేటర్ తెప్పించారు. ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో మెుబైల్ ఛార్జింగ్ సాకెట్లను ఏర్పాటు చేశారు. ఇది తెలుసుకున్న గ్రామస్థులు తమ మెుబైల్స్ కు ఛార్జింగ్ పెట్టుకునేందుకు పోటీ పడ్డారు. భారీగా జనరేటర్ వాహనం వద్ద గుమికూడి సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. వీరి కష్టం పగోడికి కూడా రాకూడదంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.