BR Ambedkar Jayanti: గత దశాబ్దకాలంగా దేశంలో ‘జుమ్లా లేదా హమ్‌లా’ రాజకీయం కొనసాగుతోంది. రాజ్యాంగవిరుద్ధమైన పద్ధతుల్లో రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవటం, రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగ పరచి ప్రత్యర్థులను వేటాడటం, దేశాన్నంతా ఒకే నమూనాలోకి తీసుకురావాలనే ప్రయత్నం నిరంతరం జరుగుతోంది. ప్రజాస్వామ్యం తన సహజత్వాన్ని కోల్పోయి ఒక తెలియని భయానికి, నిరాశకు, విస్మృతికి లోనైపోయింది. మితిమీరిన అధికారం పదేళ్లలో అనేక అడ్డదారులు తొక్కినా ఇదేంటని నిలదీసిన స్వరాలను వేళ్లమీద లెక్కించాల్సిన దుస్థితి. ఈ వర్తమాన పరిస్థితులు చూస్తుంటే.. 1949 నవంబరు 26న డా. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో అంబేద్కర్ చేసిన ఒక హెచ్చరిక గుర్తుకువస్తోంది. 1950 జనవరి 26 నుంచి భారత సమాజం వైరుధ్యభరితమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోందనీ, వీలున్నంత త్వరగా సమాజంలోని సామాజిక- ఆర్థిక అసమానతలను ప్రభుత్వాలు తొలగించాలనీ, లేకుంటే రాజ్యాంగసభ కష్టపడి నిర్మించిన రాజ్యాంగ వ్యవస్థలను అసమానతలకు బలైన వర్గాలు బద్దలుకొట్టి తీరతాయన్నారని ఆనాటి రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి వేళ..మన రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబరు 26 వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా 2015లో ప్రకటించిన మోదీ సర్కారు.. యధేచ్ఛగా రాజ్యాంగానికి తూట్లు పొడిచే నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ఆ మహోన్నత నాయకుని స్ఫూ్ర్తిని నోటితో పొగడుతూ నొసటితో వెక్కిరిస్తూనే వస్తోంది.
కులం పునాదుల మీద ఒక నీతిని, జాతిని నిర్మించలేమని కుండబద్దలు కొట్టి, అంటరానితనం, అమానవీయ ధోరణుల మీద అలుపెరగని పోరాటం చేసిన అంబేద్కర్ చెప్పిన అనేక మాటలు నేటి సమాజంలోని బలహీనులకు స్ఫూర్తి మంత్రాలుగా నిలుస్తూనే ఉన్నాయి. సింహాలను ఎవరూ బలివ్వరని, నోరులేని మేకలనే బలిస్తారనీ, కనుక పౌరులు తమ హక్కుల స్ఫూర్తితో సింహాల్లా బతుకాలని ఆయన దగాపడిన వర్గాలకు హితబోధ చేశారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని స్పష్టం చేశారు. ‘నీ కోసం మాత్రమే బతికితే నీలోనే జీవిస్తావు.. జనం కోసం జీవిస్తే జాతి హృదయంలో నిలిచిపోతావు’ అని చెప్పటమే గాక దానిని ఆచరించి చూపుతూనే, ఎవరి బానిసత్వాన్ని వారే పోగొట్టుకోవాలని, ఏ దేవుడూ, ఏ వ్యక్తి మీదా ఆధారపడొద్దని పదేపదే ప్రబోధించారు అంబేద్కర్.
సుదీర్ఘ స్వాతంత్యపోరాటం, అంబేద్కర్ వంటి అనేక మంది నేతల ఆకాంక్షల మూలంగా భారత్ ఒక సంక్షేమ రాజ్యంగా అవతరించింది. రాజ్యాంగంలోనూ ఈ భావనను భద్రంగా రాజ్యాంగ నిర్మాతలు పొందుపరచారు. అసమానతలు, వివక్షలకు అతీతంగా ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించేందుకు మన రాజ్యాంగం పూచీపడుతుండగా, నేటి పాలనలో అది రోజురోజుకూ కొరవడుతోంది. దేశ భౌగోళిక స్వరూపం, జాతులు, తెగలు, భాషలు, సంస్కృతీ సంప్రదాయాల్లో వైవిధ్యాలను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం ఆయా వర్గాలకు తగిన వెసులుబాట్లు కల్పించింది. సంపద కొందరి చేతుల్లో కేంద్రీకృతం కావటం, వనరుల మీద అందిరికీ హక్కులుండాలనే భావనలు సోషలిజానికి కారణమయ్యాయి. బ్యాంకులు, బీమా, పెద్ద ప్రైవేటు సంస్థల జాతీయకరణకు ఈ భావనే ప్రాతిపదిక. ఇక.. అందరి విశ్వాసాలను గౌరవిస్తామనే మాటను రాజ్యాంగపు పీఠికలోని ‘లౌకిక’ పదం నొక్కి చెబుతోంది.
Also Read: Revanth Reddy : దక్షిణానికి భవిష్యత్ ఆశాకిరణం
కానీ, ఈ పదేళ్లలో అంబేద్కర్ చెప్పిన ప్రతి రాజ్యాంగ విలువనూ మన కేంద్ర పాలకులు తీసి పక్కనబెట్టేశారు. రాజ్యాంగ విలువలకు తిలోదికాలిస్తూ, ఆర్థిక దోపిడీకి, విద్వేషాల వ్యాప్తికి ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పరిశ్రమల మూసివేత, కార్పొరేషన్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ వేగంగా జరిగిపోతూనే ఉంది. ఈ కాలంలో విశాఖ ఉక్కు మొదలు నవరత్న, మినీరత్న పరిశ్రమలను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులు/సంస్థలకు దఖలు పడ్డాయి. ఎల్‌ఐసీ విలువ తగ్గింపు, భారత అల్యూమినియం కంపెనీ, హిందుస్థాన్ జింక్, ఇండియన్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ వంటి కంపెనీలు రిలయన్స్‌కు, విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ టాటాలకు దక్కాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోకెమికల్స్‌లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ, అశోకా హోటళ్ల అమ్మకం సులభంగా జరిగింది. ఇక మెరుగైన పాలన, పారదర్శక ప్రభుత్వ నిర్ణయాల పాలన కొరకు రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన స.హ చట్టం, కేంద్ర సమాచార కమిషన్‌లకు సవరణలు చేసి వాటి కోరలు పీకారు. రిజర్వ్‌బ్యాంకు, ఎలక్షన్ కమిషన్, సీబీఐ, ఈడీల పనితీరు రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో రాత్రికి రాత్రి కొత్త ముఖ్యమంత్రులు అవతరించారు. ఆకలి, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణ సూచికలలో దేశ ప్రమాణాలు వెక్కిరించటంతో బాటు నిరుద్యోగ సమస్య,ధరల పెరుగుదల విపరీతంగా పెరిగిపోయింది. భారత రాజ్యాంగ విలువలను అడుగడుగునా మంటగలుపుతున్న మన విఫల పాలకులు రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథమని పొగడటం వింతల్లోకెల్లా వింత.
అంబేద్కర్‌ను ఓట్లు కురిపించే యంత్రంగా మార్చిన మన పాలకులు, ప్రస్తుతం ఆయన ఆలోచనల పరిధిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. వారి దృష్టిలో ఏప్రిల్ 14 అనేది ఏడాదిలో వచ్చే ఒక ప్రత్యేక సందర్భం మాత్రమే. ఈ పరిస్థితిని తొలగించి, పాలకుల చేత రాజ్యాంగ లక్ష్యాల అమలు జరిపించేలా చేసి, అంబేద్కర్ తాత్వికతను పదికాలాల పాటు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మనదే. రాజ్యాంగ నైతికత అనేది సహజ భావనగా గాక దానిని ప్రతి వ్యక్తిలో రోజువారీగా పెంపొందించాలన్న డా.బీ. ఆర్ అంబేద్కర్ ఆశయాలను తరాలకు స్ఫూర్తివంతంగా అందించాలనే పౌరుల సంకల్పమే ప్రస్తుత పరిస్థితిలో నియంత పాలకుల నిరంకుశ నిర్ణయాలకు ఎక్కడో ఒక చోట చెక్ పెట్టగలుగుతుంది. ఈ లోక్‌సభ ఎన్నికల వేళ ‘నా ప్రజలు ఓటు విలువ తెలుసుకొని దానిని వాడుకుని పాలకులవుతారో లేక దాన్ని అమ్ముకుని బానిసలుగా మిగిలిపోతారో వారి చేతుల్లోనే ఉంది’ అనే మాటను దేశమంతా గుర్తుంచుకోవాల్సిన అవసరమూ కనిపిస్తోంది.