GPS-based Toll System: టోల్ ప్లాజా వచ్చేసిందా? అరెరె.. ఇక్కడ సమయం వృథా అవుతుందే? ఫాస్టాగ్ లో డబ్బులు మరచిపోయామే.. ఇక ఇలాంటి వాటికి కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక కొత్త తరహా టోల్ వసూలుకు కేంద్రం చర్యలు తీసుకుంది. దీనితో సమయం ఆదా కానుంది, ఇప్పటికే ఫాస్టాగ్ తో సరికొత్తగా టోల్ వసూలుకు చర్యలు తీసుకున్న కేంద్రం మే 1 నుండి జీపీఎస్ టోల్ వసూళ్లు సాగించనుంది. అసలు జీపీఎస్ టోల్ వసూళ్లు అంటే ఏమిటో తెలుసుకుందాం.
సాధారణంగా మనం జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలలో ప్రయాణించేందుకు టోల్ గేట్ ఫీజు చెల్లించాలి. అందుకు గతంలో టోల్ గేట్ ల వద్ద వాహనాల రద్దీ ఉండేది. వాహనం ఆపాలి, డబ్బులు చెల్లించాలి, ఆపై రశీదు పొందాలి. ఇది నాటి పద్దతి. కానీ కేంద్రం ఇలాంటి తిప్పలకు స్వస్తి పలుకుతూ ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. కేవలం క్షణాల వ్యవధిలో వాహనాలు టోల్ గేట్ దాటే పరిస్థితి వచ్చింది.
జస్ట్ అలా వాహనం వచ్చిందా? అలా స్కాన్, ఆపై రయ్.. రయ్ అంటూ వాహనాల వెళ్లడం ఇది ఫాస్టాగ్ లక్ష్యం. అయితే కొన్ని సార్లు ఫాస్టాగ్ పై కూడా విమర్శలు రాగా, కేంద్రం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. అదే జీపీఎస్ టోల్ వసూలు. ఈ పద్దతితో వాహనదారులకు జరిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం.
భారతదేశం వ్యాప్తంగా మే 1, 2025 నుండి జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను కేంద్రం ప్రారంభించనుంది. ఇది ప్రస్తుత ఫాస్టాగ్ విధానం కంటే వెరీ ఫాస్ట్ అనే చెప్పవచ్చు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా వాహనాల ప్రయాణ దూరాన్ని ఆధారంగా చేసుకుని టోల్ చార్జీలు వసూలు చేయబడతాయి. దీనితో ప్రతి టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపే అవసరం ఉండదు.
ఎలా పనిచేస్తుంది?
జీపీఎస్ టోల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ముందుగా ప్రతి వాహనంలో ఆన్-బోర్డ్ యూనిట్ అనే ట్రాకింగ్ పరికరం అమర్చబడుతుంది. ఈ పరికరం వాహన ప్రయాణాన్ని శాటిలైట్ ద్వారా ట్రాక్ చేస్తుంది. వాహనం ప్రయాణించిన దూరాన్ని ఆధారంగా చేసుకుని టోల్ చార్జీలు లెక్కించబడతాయి. ఈ చార్జీలు ఆటోమేటిక్‌గా వాహనదారుల అకౌంట్ నుండి డెబిట్ అవుతాయి.
Also Read: Trump In AP: ఏపీకి డొనాల్డ్ ట్రంప్ రాక.. పిల్లలతో గోళీలాట..
ప్రయోజనాలు ఇవే..
జీపీఎస్ టోల్ వ్యవస్థ అమల్లోకి వస్తే, టోల్ ప్లాజాల వద్ద వాహనాలకు ఇక బ్రేక్ వేయాల్సిన పని లేదు. దీని ఫలితంగా ట్రాఫిక్ జామ్‌లు కూడా తగ్గుతాయి. వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా చార్జీలు వసూలు చేస్తారు. కాబట్టి ఈ టోల్ వసూలుతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే ముందు ట్రక్కులు, బస్సులు వంటి వాహనాలపై అమలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇతర వాహనాలకు ఈ నిబంధన వర్తించనుంది.
OBU పరికరం ఉండాల్సిందే..
వచ్చే నెల నుండి జీపీఎస్ విధానం అమల్లోకి రానుండగా, ప్రతి వాహనం OBU పరికరాన్ని అమర్చడం తప్పనిసరిగా మారుతుంది. OBU లేని వాహనాలు GNSS లైన్లలో ప్రవేశిస్తే, రెండు రెట్లు టోల్ చార్జీలు వసూలు చేయబడతాయి.అందుకే ప్రతి ఒక్కరూ ఈ పరికరం కలిగి ఉండాలి. అయితే ఈ పద్దతి ద్వారా భారతదేశ వ్యాప్తంగా రవాణా మరింత సులభతరం కానుందని కేంద్రం అభిప్రాయం.