Irrigation Department office: షాద్ నగర్ పట్టణంలోని నీటి పారుదల శాఖ కార్యాలయం ఈవీ కార్ల ఛార్జింగ్ కు అడ్డాగా మారింది. ఛార్జింగ్ పేరిట అధికారులు దర్జాగా కార్యాలయంలో విద్యుత్ చౌర్యం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల మోత కారణంగా ఈ మధ్యకాలంలో అధికారులు విద్యుత్ కార్లను ఎక్కువగా వినియోస్తున్నారు. ఇంటి దగ్గర ఛార్జింగ్ పెడితే వందలు, వేలల్లో బిల్లు వస్తుండడంతో కరెంటు బిల్లు తడిచి మోపెడు అవుతోందన్న కారణంతో కొందరు అధికారులు విద్యుత్ ఛార్జింగ్ కోసం ప్రభుత్వ కార్యాలయాలనే అడ్డాగా మార్చుకుంటున్నారు.
షాద్ నగర్ లోని ఇరిగేషన్ కార్యాలయంలో నిత్యం ఇదే తంతు కొనసాగుతోంది. చూసేవారెవరు.. అడిగే వారెవరు? అనే ధీమాతో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. పేదవారు తప్పు చేస్తే దూకుడుగా వ్యవహరించే విద్యుత్ శాఖ అధికారులు.. ప్రభుత్వ కార్యాలయంలో ఇలా విద్యుత్తు చౌర్యం చేస్తున్న వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.