Khammam District: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల లబ్ది, అర్హులకు అందేలా పకడ్బందీగా కార్యాచరణ అమలుచేయాలని ఇంచార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. ఇంచార్జ్ కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అధికారులతో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీరు, భూ భారతి లపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెట్టినట్లు, ఈ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు లేదా యూనిట్ల ఏర్పాటుకు యువతకు సబ్సిడీతో 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఎస్సి కార్పొరేషన్ ద్వారా 29091, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 14220, బీసీ కార్పొరేషన్ ద్వారా 41881, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 6658 దరఖాస్తులు, మొత్తంగా 91850 దరఖాస్తులు సోమవారం నాటికి అందినట్లు, అన్ని దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు ఇంచార్జ్ కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Also Read: Bhu Bharati Act: భూ భారతి అప్పీల్ చేయాలా?.. ఈ రూల్స్ తెలుసుకోండి!
ఇందిరమ్మ ఇండ్ల విషయమై అర్హులై, ప్లాట్లు ఉన్న ఎల్1 జాబితాను ఎంపిడివో సంతకంతో తీసుకొని, ఆమోదం కొరకు ఇందిరమ్మ కమిటీ ముందు ఉంచాలన్నారు. ఇందిరమ్మ కమిటీ ఆమోదం తర్వాత మండల ప్రత్యేక అధికారి ఆయా జాబితాను జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆమోదం కొరకు సమర్పించాలన్నారు. ఇంచార్జ్ మంత్రుల ఆమోదం తప్పనిసరి అని తెలిపారు.
వేసవి దృష్ట్యా జిల్లాలో త్రాగునీటికి ఎక్కడా సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఇంచార్జ్ కలెక్టర్ అన్నారు. నియోజకవర్గాల వారిగా కావాల్సిన పనుల విషయమై నివేదిక సమర్పించాలన్నారు. ఇంట్రా, గ్రిడ్ లకు 1 లేదా 2 బఫర్ లు పెట్టాలన్నారు. కోత్తగా కాలనీలు, హాబీటేషన్ లు ఏర్పడ్డ చోట పైప్ లైన్ పొడిగింపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వనరుల మరమ్మత్తులు, ప్రత్యామ్నాయ వనరులు, వనరులు లేని వాటికి ఖర్చు విషయమై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అత్యవసర త్రాగునీటి అవసరాల నిమిత్తం కలెక్టర్ వద్ద నిధుల మంజూరికి పనుల గుర్తింపు వెంటనే చేపట్టాలన్నారు.
Also Read: TG on SDRF: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏకంగా రూ. 4 లక్షల సాయం అందించేందుకు రెడీ..
భూ భారతి అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఇంచార్జ్ కలెక్టర్ అన్నారు. భూ భారతి అమలు విషయమై పైలట్ ప్రాజెక్ట్ క్రింద జిల్లాలోని నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేశారని తెలిపారు. మండల హెడ్ క్వార్టర్స్ లో భూ భారతి చట్ట అమలుపై అవగాహన కార్యక్రమం చేపడతామన్నారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల ఏర్పాటుకు షెడ్యూల్ రూపొందించాలన్నారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల విజయవంతానికి తహసీల్దార్, ఎంపిడివో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో లబ్ధిదారుల సమీకరణ, అవగాహన కల్పనకు పటిష్టమైన ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ దీక్షా రైనా, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఎంపిడిఓ లు, ఎంపీవో లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు