TTD EO: మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణంలో ఎలాంటి వాస్తవం లేదని, పాలకమండలి అధ్యక్షులుగా కరుణాకర్ రెడ్డి ఉన్న సమయంలో చనిపోయిన గోవుల ఫోటోలను తీసుకువచ్చి ప్రచారం చేసినట్లు టీటీడీ ఈవో శ్యామల రావు అన్నారు.
ఇటీవల టీటీడీ పరిధిలోని గోశాలలో గోమాతలు చనిపోయినట్లు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై టీటీడీ పలుమార్లు వివరణ ఇచ్చింది. అయితే తాజాగా ఇదే విషయంపై స్పందించిన ఈవో సంచలన కామెంట్ చేయడం విశేషం.
ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. తిరుమల కు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. క్యూ లైన్ లో భక్తులకు అన్నప్రసాదం అనునిత్యం అందించేలా చర్యలు చేపట్టామని, అంతేకాకుండా పారిశుధ్య మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో ఆన్లైన్ ద్వారా దళారులను ఆశ్రయించి గదులు, దర్శన టికెట్లు భక్తులు పొందే వారని, అర్హత లేని వ్యక్తిని ఐటి విభాగంలో ఉంచారన్నారు.
ఒక బ్రోకర్ 50 సార్లు సేవ టికెట్లు పొంది ఇతరులకు విక్రయించిన ఘటనలు జరిగాయని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అన్ని చర్యలు చేపట్టిందన్నారు. కల్తీ నెయ్యితో తయారుచేసిన ప్రసాదాలను శ్రీవారికి సమర్పించారని, కల్తీ చేసే సప్లయర్స్ భయపడి ప్రస్తుతం ముందుకు రావడం లేదన్నారు. శ్రీవారి భక్తులకు అందించే అన్న ప్రసాదం హై క్వాలిటీ గా అందిస్తున్నామని, స్వచ్ఛమైన నెయ్యితో తయారుచేసిన ప్రసాదాలు, లడ్డూ స్వామివారికి సమర్పిస్తున్నామన్నారు.
గోశాలలో అక్రమాలు, అవకతవకలు గతంలో జరిగాయని, మార్చి 2021 నుండి మార్చి 2024 వరకు గోశాలలో అనేక అక్రమాలు జరిగాయని ఈవో అన్నారు. చనిపోయిన గోవుల లెక్కలు దాచడం, అశుభ్రమైన ఆహారం గోవులకు అందించడం, అంతేకాకుండా గడువు తీరిన మందులను అందించారన్నారు. విజిలెన్స్ ఎంక్వయిరీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఈవో తెలిపారు.
హిందువుల మనోభావాలు ముడిపడిన అంశం కాబట్టి గోశాలకు ఎవరైనా వెళ్లి చూడవచ్చని, అయితే గోశాల నిర్వహణ చాలా ట్రాన్స్పరెంట్ గా నిర్వహిస్తున్నామన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు సార్లు గోశాలలో అగ్నిప్రమాదం సంభవించిందని, కాంట్రాక్టులో భారీ అవకతవకలు జరిగాయన్నారు. కానీ గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈవో తెలిపారు.
Also Read: Gold Rate Today : మహిళలకు గుడ్ న్యూస్.. ఈ రోజు భారీగా తగ్గిన బంగారం ధరలు!
ప్రస్తుతం వీటిపై చర్యలు తీసుకుంటున్నామని, మార్చి 2024 లో 14 లక్షలు లీటర్ల పాల కోసం కాంట్రాక్టు ఇచ్చారని, నాసిరకం పాలు కావడంతో టెండర్లను రద్దు చేశారన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారం చేశారని, అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. మొత్తం మీద గోశాల గురించి జరుగుతున్న ప్రచారాలపై ఈవో ఓ క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు.