కొత్తగూడెం స్వేచ్చ: Bhadradri Kothagudem district: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు అధికారుల అండదండలతో జోరుగా కొనసాగుతున్నాయి. చుంచుపల్లి మండలం పరిధిలో విద్యానగర్, రాంనగర్, నంద తండా, రామాంజనేయ కాలనీ ,ఎన్ కె నగర్, భదవత్ తండా గ్రామ పంచాయతీ పరిదిలో భారీ అక్రమ బహుళ అంతస్తులు, జి ప్లస్ త్రీ నిర్మాణాలు జరుగుతన్నా, పంచాయతీ అధికారులు కానీ మండల అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో అక్రమ నిర్మాణదారులకు హద్దే లేకుండా పోయింది.
మెయిన్ రోడ్డు మీదనే భారీ కట్టడం అనుమతులు లేకుండా నిర్మిస్తున్నప్పటికీ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భద్రాచలంలో బహుళ అంతస్తుల భవనం కూలిపోయిన సంఘటన ఇంకా కళ్ళముందే మెదులుతుంది. ఇటువంటి అక్రమ బహుళ అతస్తుల నిర్మాణాలకు సహకరిస్తున్నది పంచాయతీ మండలాధికారులే కదా. స్థానిక అధికారులతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుని అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తున్నందునే విచ్చలవిడిగా బహుళ అంతస్థుల భవనాలు వెలుస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై అధికారులను మీడియా వివరణ కోరగా నోటీసులు అందజేస్తామంటూ కాలయాపన చేస్తున్న మండల స్థాయి సిబ్బంది. నోటీసులు అందజేసి అక్రమ నిర్మాణాలకు సహకరించుడేనా పంచాయతీ సెక్రటరీల విధి అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అనుమతులు లేని నిర్మాణాలు ఆపాల్సిన పంచాయతీ సెక్రెటరీ నోటీసులతో సరిపెట్టడంతో బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా కొనసాగు తున్నయి.ఎన్ని సార్లు కంప్లెయింట్ ఇచ్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అని కొంత మంది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
Also Read: Domestic Violence Survey: భార్యతో గొడవ పడుతున్నారా? ఈ సర్వే చూస్తే ఆ ధైర్యం చేయరు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1/70 యాక్టు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే అయినప్పటికీ జోరుగా కమర్షియల్ నిర్మాణాలు ఎలా కడుతున్నారు. మండల అధికారుల ఆధ్వర్యంలోనే నిర్మాణాలు కొనసాగుతున్నాయా అనే అనుమానం కలుగక మానదు. కనీసం నోటీసులు అందజేయాల్సిన పంచాయతీ అధికారలు ఇప్పటివరకు కూడా వారికి నోటీసులు అందజేయకుండా అక్రమ నిర్మాణదారులకు పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారులే వారికి వెసులుబాటు కల్పిస్తూ పూర్తిగా సహకరిస్తుండడం, నిర్మాణదారులకు ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతుంది. నోటీసులు అందజేయాల్సిన అధికారులు తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇప్పటికైనా మండల అధికారులు జిల్లా అధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయవలసిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు.
బహుళ అంతస్థుల నిర్మాణాలకు సహకరిస్తున్న పంచాయతీ ,మండలాధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బహుళ అంతస్తుల జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేయాలని భద్రాచలంలో జరిగిన సంఘటన చుంచుపల్లి మండలంలో జరగకుండా చూడాలని చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదని, సంఘటనలు జరిగాక హడావుడి చేస్తే లాభం ఎంటని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/