ఖమ్మం: Khammam district: ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురంలోని మహిళలపై మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కేవలం ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ ద్వారా టేకుమట్ల కళావతి , చిలుముల అరుణ, నవిళ్ళ ధనలక్ష్మి లకు 50 వేలు చొప్పున అప్పుగా ఇచ్చారు. ఇందులో బీమా, ప్రాసెసింగ్ ఫీజు పేరిట 2వేలు ముందే కోత పెట్టారు.
బాధితులు కట్టవలసిన ఒక నెల ఈఎంఐ అమౌంట్ 2,670 ను కట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో మైక్రో ఫైనాన్స్ సిబ్బంది, మేనేజర్ ఆ మహిళలను డబ్బులు కట్టాలని ఇంటి ఎదుట బైఠాయించారు. కనీసం వారిని మంచినీళ్లు కూడా తాగనీయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అక్కడితో ఆగకుండా వారికి ఉన్న గుడిసెలను సైతం తాళం వేసి స్వాధీనపరచు కుంటామని భయభ్రాంతులకు గురి చేశారు.
Also Read: UPI Down: దేశంలో నిలిచిపోయిన గూగుల్ పే, ఫోన్ పే చెల్లింపులు.. ఎందుకంటే?
వారి బెదిరింపులు తాళలేక మనస్థాపానికి గురైన బాధిత మహిళలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని పేర్కొన్నప్పటికీ పట్టించుకోలేదు. ఇక చేసేది లేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అనడంతో అక్కడి నుంచి ఉడాయించారు. ఈ విషయంపై ఎస్సై అనిల్ ను వివరణ కోరగా ఫైనాన్స్ వసూళ్ల పేరిట బాధితుల ఇండ్ల పైకి వెళ్లి బెదిరింపులకు పాల్పడడం చట్టరీత్యా నేరం అన్నారు.
బాధితులు నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫైనాన్స్ వారు నిబంధనల మేరకు నడుచుకోవాలి తప్ప చట్టాన్ని అతిక్రమించ వద్దని సూచించారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/